మసీదులోకి మహిళలకు అనుమతి

24 Apr, 2016 11:00 IST|Sakshi
మసీదులోకి మహిళలకు అనుమతి
కొట్టాయం: కేరళలోని ప్రముఖ సున్నీ మసీదులోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని మసీదు పెద్దలు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. కొట్టాయంలో గల 8వ శతాబ్దానికి చెందిన ఈ మసీదును చూడడానికి దేశ, విదేశాలనుంచి ఎంతో మంది పర్యాటకులు నిత్యం  వస్తుంటారు. ఇప్పటి వరకు ఈ మసీదులోకి మహిళలకు ప్రవేశం లేదు. అయితే రెండు రోజులు స్థానికంగా ఉన్న మహిళలకు ప్రవేశం కల్పించాలని మత పెద్దలు నిర్ణయించారు.
 
ఇస్లాంలోని  సున్నీ  సంప్రదాయంలో మహిళలు మసీదులో ప్రవేశించడం గానీ, ప్రార్థనలు చేయడం గానీ సాంప్రదాయాలకు విరుద్ధం. మే 8న ఈ సాంప్రదాయానికి మహిళలు బద్దలు కొట్టనున్నారు. ఈ మసీదులోని అద్భుత నిర్మాణాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు. స్థానికంగా ఉన్న మహిళలు తమకు కూడా మసీదును చూసే అవకాశం కల్పించాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారికి రెండు రోజులు ప్రవేశానికి అనుమతినిస్తున్నట్టు మసీదు మౌల్వి సిరాజుద్దీన్ పేర్కొన్నారు. మసీదు పెద్దలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్థానిక ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు