వివేకానందుడి 9/11నుగుర్తుంచుకుని ఉంటే!

12 Sep, 2017 00:48 IST|Sakshi
వివేకానందుడి 9/11నుగుర్తుంచుకుని ఉంటే!

అమెరికా 9/11 ఉగ్రదాడి జరిగుండేది కాదు

స్వామి వివేకానందుడు ప్రపంచానికి ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పంచారు
ఆ స్ఫూర్తితోనే మా ప్రభుత్వం నడుస్తోంది 
యువత సృజనాత్మతను పెంచుకోవాలి
పరిశుభ్రంగా ఉంటేనే వందేమాతరం అని నినదించే హక్కుంది
చికాగోలో వివేకానంద ప్రసంగానికి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ


న్యూఢిల్లీ: 125 ఏళ్ల క్రితం 9/11 (సెప్టెంబర్‌ 11)న చికాగోలో స్వామి వివేకానంద ఇచ్చిన శాంతి, సౌభ్రాతృత్వ సందేశాన్ని ప్రపంచం గుర్తుపెట్టుకుని ఉంటే.. 16 ఏళ్ల క్రితం అమెరికాలో 9/11 ఘటన (డబ్ల్యూటీసీ టవర్ల కూల్చి వేత తదితర ఉగ్ర విధ్వంసం) చోటు చేసుకునేది కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. ఒకే తేదీన జరిగిన ఈ రెండు ఘటనలను పోలుస్తూ..  స్వామి వివేకానందుడి విశ్వ శాంతి సందేశాన్ని ప్రధాని గుర్తు చేశారు.

స్వామి వివేకానంద ప్రపంచ మానవాళికి అందించిన ఆ సందేశంలోని స్ఫూర్తిని మరచిపోవడం వల్లనే ఉగ్ర ఉత్పాతాలు చోటు చేసుకుంటున్నాయని, సమస్యలు పెరుగుతున్నా యని విశ్లేషించారు. వివేకానందుని చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనం ప్రసంగానికి 125 ఏళ్లు, పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. యువత సృజనాత్మక పరిష్కారాలతో దేశ సమస్యలను దూరం చేయాలని పిలుపునిచ్చారు.

సేవలోనే భగవంతుడున్నాడు
‘2001కు ముందు ప్రపంచానికి 9/11 ప్రాముఖ్యత తెలియదు. దీన్ని మరిచిపోవటం మన తప్పిదం. కాషాయ తలపాగా చుట్టుకుని చికాగో సర్వమత సమ్మేళనంలో అడుగుపెట్టిన నరేంద్రుడు (వివేకానందుడి అసలుపేరు).. ప్రపంచానికి సోదరభావాన్ని నేర్పించారు. ఎక్కడా భారత సంస్కృతిని, సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. దేశంలోని లోపాలను ఎత్తిచూపటంలోనూ వివేకానందుడు సందేహించలేదు. ఆనాటి 9/11ను గుర్తుపెట్టుకుని ఉంటే.. 2001లో 9/11న అమెరికాపై ఉగ్రదాడి జరిగుండేది కాదు’ అని మోదీ పేర్కొన్నారు. పూజలు, పునస్కారాల ద్వారా దేవుడు కనిపించడని.. తోటి మనిషికి సేవ ద్వారానే భగవంతుడిని చేరుకోవచ్చన్న వివేకానందుని గొప్ప సందేశాన్ని గుర్తుచేశారు.  

సృజనాత్మకత పెంచుకోండి
నవ భారత నిర్మాణం కోసం దేశ యువత పనిచేయాలని కోరిన మోదీ.. ఈ దిశగా ముందుకెళ్లేందుకు సృజనాత్మకత, నైపుణ్యాన్ని పెంచుకోవాలని కోరారు. ‘యూనివర్సిటీ క్యాంపస్‌ల కన్నా గొప్ప సృజనాత్మకతా కేంద్రాలుండవు. సృజనాత్మకత లేకుండా జీవితమే ఉండదు’ అని ప్రధాని కోరారు. హరియాణా కాలేజీల్లో తమిళ్‌ డేను, కేరళ కాలేజీల్లో పంజాబీ డేను జరుపుకోవటం ద్వారా ‘ఏక్‌ భారత్, శ్రేష్ఠ్‌ భారత్‌’ స్ఫూర్తి బలోపేతమవుతుందన్నారు.

మహిళలను గౌరవించే వారికే.. వివేకానందుడి చికాగో ప్రసంగం ప్రారంభ వాక్యాలైన ‘డియర్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ అమెరికా’ అన్న పదాల స్ఫూర్తి అర్థమవుతుందన్నారు. భారత్‌లో పరిశ్రమలు స్థాపించాలంటూ జంషెడ్‌జీ టాటాకు వివేకానందుడు రాసిన లేఖలను మోదీ ప్రస్తావించారు. ప్రపంచమంతా సమస్యల్లో చిక్కుకుని ఉన్నప్పుడు ‘వన్‌ ఆసియా’నే ప్రపంచానికి దారిచూపిస్తుందన్న వివేకానందుడి ఆలోచననూ మోదీ గుర్తుచేశారు. 5వేల ఏళ్ల నాటి రాముడు, బుద్ధుడి భారతాన్నే నేటి భారతంలోనూ ప్రపంచం చూస్తోందని మోదీ పేర్కొన్నారు.

పరిసరాలు చెత్తగా చేసే హక్కు లేదు
దేశాన్ని స్వచ్ఛంగా ఉంచే వారికే వందేమాతరం అని నినదించే హక్కుందని మోదీ పేర్కొన్నారు. పారిశుధ్ధ్య, స్వచ్ఛ కార్మికులను ప్రశంసించిన ప్రధాని.. వారికే ముందుగా వందేమాతరం అనే హక్కుంటుందన్నారు. దేశాన్ని అపరిశుభ్రంగా ఉంచే వారెవరికీ వందేమాతరం అని పలికే హక్కులేదన్నారు.

ఆ ప్రసంగం నేటికీ సందర్భోచితం: సోనియా
1893లో వివేకానందుడు చికాగోలో అందరం ఒకటేనంటూ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం నేటికీ సందర్భోచితమేనని కాం గ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నాడు. నేటి అసహనం, ద్వేషపూరిత వాతావరణంలో నరేంద్రుడి బోధనలు అంత్యంత అవసరమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘అన్ని మతాలు ఒక్కటేనన్న సందేశాన్ని ప్రోత్సహించటం ద్వారా స్వామీజీ మనుషులంతా ఒక్కటేనన్న భావనను ప్రచారం చేశారు. ఆనాడు స్వామీజీ ఆందోళన వ్యక్తం చేసిన సవాళ్లు (అసహనం, ద్వేషం) నేటి సమాజంలోనూ కనిపిస్తున్నాయి. అందుకే వివేకానందుడి సందేశాన్ని శిలాశాసనంలా అమలుచేయాల్సిన అవసరం ఉంది’ అని సోనియా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు