లీజు రెన్యువల్‌ వివరాలు ఇవ్వండి

25 Jun, 2018 03:15 IST|Sakshi

సీఐసీని ఆశ్రయించిన ‘ప్రధాని మోదీ ఆంటీ’

న్యూఢిల్లీ: తన స్థలంలో ఉన్న ప్రభుత్వ డిస్పెన్సరీ లీజు పునరుద్ధరణ(రెన్యువల్‌)కు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద ఇవ్వడానికి కార్మిక శాఖ నిరాకరించడంపై ప్రధాని మోదీ ఆంటీగా చెప్పుకుంటున్న 90 ఏళ్ల మహిళ అప్పీలేట్‌ అథారిటీని ఆశ్రయించింది. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో దహిబెన్‌ నరోత్తమ్‌దాస్‌ మోదీ నివసిస్తున్నారు. ఆమెకు చెందిన స్థలంలో బీడీ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ డిస్పెన్సరీ నడుస్తోంది. 1983లో రూ. 600 అద్దె ఇవ్వగా.. అనంతరం రూ.1,500కు పెంచారు. అప్పటి నుంచి అద్దె పెంచకపోవడంతో గత ఏడాది డిసెంబర్‌లో లీజు వివరాలు, పునరుద్ధరించక పోవడానికి కారణాలు చెప్పాలంటూ కార్మిక శాఖకు సమాచార హక్కు చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. సరైన సమాధానం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ)కి దహిబెన్‌ ఫిర్యాదు చేశారు.

గత వారం సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు వద్దకు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. లీజును రెన్యువల్‌ చేయకపోవడంతో ఆ మొత్తంతో జీవించడం కష్టంగా మారిందని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆమె మొదట దాఖలు చేసిన పిటిషన్‌కు సరైన సమాధానం రాకపోవడంతో.. 2018 జనవరి 9న ఆమె రెండో అప్పీలు దాఖలు చేశారు. అందులో తాను ప్రధాని మోదీ ఆంటీనని, తనకు న్యాయం జరగకపోతే ప్రధానికే ఈ విషయం తెలియజేస్తానని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో బంధుత్వం గురించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆమె అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ ఎందుకు సమాధానం ఇవ్వలేదని, ఆమె ఆర్‌టీఐ పిటిషన్‌ను విచారించిన అధికారులపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలపాలని సమాచార కమిషనర్‌ శ్రీధర్‌ ఆచార్యులు ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు