‘తబ్లిగీ’కి వెళ్లిన వారిలో 9,000 మంది క్వారంటైన్‌ 

3 Apr, 2020 02:02 IST|Sakshi
ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో క్రిమిసంహారిణిని స్ప్రే చేస్తున్న ఫైర్‌ సిబ్బంది

2,069 దేశవ్యాప్తంగా కరోనా కేసులు 

53 దేశంలో కరోనా మరణాల సంఖ్య 

960 మంది విదేశీయుల వీసాలు రద్దు 

న్యూఢిల్లీ: ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు హాజరైన వారిలో సుమారు 9,000 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను తబ్లిగీ సమావేశాల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరిగాయని హోంశాఖ జాయింట్‌ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ చెప్పారు. ‘‘తబ్లిగీ సమావేశాలకు హాజరైన 9000 మందిని, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచాం.

వీరిలో 1,306 మంది విదేశీయులు ఉన్నారు. తెలంగాణలో 96 మందిని, ఆంధ్రప్రదేశ్‌లో 24 మంది విదేశీయులను గుర్తించాం’’ అని పేర్కొన్నారు. కోవిడ్‌–19కు సం బంధించిన అధికారిక సమాచారం కోసం సమాచార, ప్రసార శాఖ ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పిందని,  pibfactcheck@gmail.com అనే మెయిల్‌ అడ్రస్‌కు మెయిల్‌ పంపడం ద్వారా ప్రజలు అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదులోంచి ఖాళీ చేయించిన వారిలో ఇద్దరు కరోనా కారణంగా గురువారం మరణించారని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు.

కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’ 
కరోనా వైరస్‌ సోకే అవకాశాలను ప్రజలు తమంతట తాము అంచనా వేసుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఒక స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ను విడుదల చేసింది. ‘ఆరోగ్యసేతు’ అని పిలుస్తున్న ఈ అప్లికేషన్‌ ద్వారా ఎవరైనా కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా వెళితే అధికారులకు తెలియజేయడమూ వీలవుతుంది. ఈ అప్లికేషన్‌ ద్వారా కొత్తగా వ్యాధి బారిన పడ్డ వారి గురించి తెలుసుకోవచ్చని, వారితో దగ్గరిగా వ్యవహరించిన వారికి అలర్ట్‌లు పంపుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అప్లికేషన్‌ ఇంగ్లిష్‌తోపాటు 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.

దేశాన్ని బట్టి...  విమానాలకు అనుమతి  
దేశంలో లాక్‌డౌన్‌ గడువు ముగిసిన తరువాత అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై  పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని  పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి  తెలిపారు. ఏప్రిల్‌ 15వ తేదీ  తరువాత ఎవరు ఏ దేశం నుంచి వస్తున్నారన్న అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

960 మంది వీసాల రద్దు 
ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌ సమావేశానికి హాజరైన 960 మంది విదేశీయులను బ్లాక్‌లిస్టులో పెట్టామని, వారి వీసాలను సైత రద్దు చేశామని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. వారంతా వీసా నిబంధనలను ఉల్లంఘించి, తబ్లిగీ జమాత్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నందుకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇలాంటి విదేశీయులు భారత్‌లో ఎక్కడున్నా ఫారినర్స్‌ యాక్ట్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర పోలీసు శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా