నెలలోపే 95% వర్షపాతం

3 Sep, 2018 04:29 IST|Sakshi

స్వల్ప సమయంలోనే భారీ వర్షాలు

పట్టణ ప్రాంతాలకు ముంపు

వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల ప్రభావం ఈ ఏడాది వర్షాలపైనా పడింది. సీజన్‌ మొత్తంలో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతంలో 95% మూడు నుంచి 27 రోజుల్లోనే నమోదైంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్ల ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో వరదలు వచ్చి ముంపునకు గురయ్యే  అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఏటా జూన్‌ 1న ప్రారంభమై సెప్టెంబరు 30 వరకు ఉంటాయి. ఈ నాలుగు నెలలు కురిసే వానలను బట్టి సగటు వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈసారి తక్కువ రోజులే వర్షాలు కురిశాయి. కురిసిన రోజుల్లో మాత్రం కుండపోతగా పడ్డాయి. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది.

దేశంలోని 22 ప్రధాన పట్టణాల్లో గంటల వ్యవధిలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. గత మూడు నెలల్లో సాధారణ వర్షపాతంలో 95% మూడు నుంచి 27 రోజుల్లోనే నమోదైంది. ఉదాహరణకు ఢిల్లీలో 99 గంటల్లోనే 95% వర్షపాతం నమోదైంది. సరాసరి 33 గంటల్లో 50% వర్షం కురిసింది. ముంబైలో మొత్తం సగటు వర్షపాతంలో 50 శాతం 134 గంటల్లోనే నమోదైంది. అహ్మదాబాద్‌లో 46 గంటల్లో 66.3 సెం.మీ. వాన కురిసింది. ఆరు రోజుల్లో సుమారు 95 శాతం వర్షపాతం నమోదైంది. వాతావరణంలో అనూహ్య మార్పులు పట్టణ యంత్రాంగాల ప్రణాళికలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. తక్కువ సమయంలో  ఎక్కువ వర్షం కురిస్తే పట్టణ ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు