వయసు 96.. మార్కులు 98

31 Oct, 2018 19:04 IST|Sakshi
పరీక్షలు రాస్తోన్న కార్థియాని అమ్మ(96)

తిరువనంతపురం : చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించిందో బామ్మ. సెంచరీ కొట్టేందుకు చేరువలో ఉన్న ఈ బామ్మ.. ఎగ్జామ్‌లో మాత్రం సెంట్‌ పర్సెంట్‌ స్కోర్‌ చేసి టాపర్‌గా నిలిచింది. దాంతో ఈ బామ్మ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేతుల మీదగా రేపు (గురువారం) మెరిట్‌ సర్టిఫికెట్ అందుకోనుంది. వివరాలు.. కేరళ అలప్పుజ జిల్లా ముత్తం గ్రామానికి చెందిన కార్థియాని అమ్మ(96)... ఆలయాల్లో శుభ్రం చేస్తూ జీవనం గడిపేది. బాల్యంలో బడి ముఖం చూడని ఈ బామ్మ చదువుపై మక్కువతో కేరళ ప్రభుత్వ ప్రారంభించిన ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమంలో చేరింది.

రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత సాధించేందుకుగాను కేరళ ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాక్షరతా మిషన్‌లో భాగంగా ఈ ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు నాలుగు, ఏడు, పది, ఇంటర్‌ తరగతులకు సంబంధించి దాదాపు 42, 933మంది పరీక్షలు నిర్వహించారు. కార్థియాని అమ్మ నాలుగో తరగతి పరీక్షలకు హాజరయ్యింది. అంతేకాక ఈ పరీక్షలో ఆమె 98 మార్కులు సాధించి టాపర్‌గా నిలించింది.

ఈ విషయం గురించి బామ్మ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు చదవగలను, రాయగలను లెక్కలు కూడా చేయగలను. చదువులో నాకు నా ముని మనవరాళ్లు సాయం చేసేవార’ని ముసిరిపోయింది బామ్మ. కాగా కార్థిమణి అమ్మ పట్టుదలను పలువురు ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. వీరిలో మహీంద్ర గ్రూప్‌ చైర్మెన్‌ ఆనంద్‌ మహీంద్ర, కేరళ పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్స్‌ ఉన్నారు. కార్థిమణి అమ్మ పట్టుదలకు ముగ్దులైన వీరు... ఆమె ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మరిన్ని వార్తలు