9 గంటల్లో 99 సెం.మీ. వర్షపాతం

11 Jul, 2016 02:22 IST|Sakshi

నాసిక్‌లో భారీ వర్షాలు.. పొంగుతున్న గోదావరి

 నాసిక్/న్యూఢిల్లీ : ఎడతెగని వర్షాలతో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కలిపి ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 99.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. కేవలం 9 గంటల్లోనే ఇంత వర్షం పడడంతో గోదావరి నదిలో వరద మొదలై  జనజీవనం స్తంభించిపోయింది. గోదావరి తీరంలో నిలిపిఉంచిన మూడు కార్లు వరదలో కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు నాసిక్ నగరానికి ప్రధాన తాగునీటి వనరైన గంగాపూర్ ఆనకట్ట 23 శాతం నిండింది. కరువు కారణంగా మేలో వట్టిపోయిన చారిత్రాత్మక రామ్‌కుండ్ ఆనకట్ట కూడా ఇప్పుడు పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. నాసర్ది నదిలోనూ ప్రవాహం పెరిగింది. రాబోయే 24 గంటల్లో నాసిక్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం  తెలిపింది. మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మృతుల సంఖ్య 15కు పెరిగింది.

 దేశంలోని 89 శాతం ప్రాంతాల్లో సాధారణ, అధిక వర్షపాతాలు నమోదయ్యాయి. గుజరాత్‌లోని అధిక భాగాలు, సిక్కిం మినహా మిగతా ఈశాన్య రాష్ట్రాలన్నీ లోటు వర్షపాతాన్ని చవిచూశాయి. దేశం మొత్తం మీద జూన్1 నుంచి జూలై 10 మధ్యలో 25.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. దేశంలో 26 శాతం ప్రాంతాల్లో అధిక, 63 శాతం ప్రాంతాల్లో సాధారణ, 11 శాతం ప్రాంతాల్లో లోటు వర్షపాతాలు నమోదయ్యాయి.

>
మరిన్ని వార్తలు