సరిహద్దు ఉద్రిక్తత : మోదీ, ట్రంప్ చర్చ

3 Jun, 2020 08:44 IST|Sakshi

భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్  

సరిహద్దు ఉద్రిక్తతలు సహా పలు కీలక అంశాలపై చర్చ

సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్  ఫోన్  సంభాషణ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండో-చైనా వివాదం తదితర సమస్యలపై  ఇరువురు నేతలు చర్చించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అటు మిత్రుడు ట్రంప్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయనీ, కోవిడ్-19, జీ7 సహా వివిధ అంశాలపై చర్చించామని స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్‌, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం మోహరింపు, ఉద్రిక్తతల నడుమ వీరి చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే తూర్పు లదాఖ్ ప్రతిష్టంభనపై ఇరువురు నాయకులు చర్చపై ప్రత్యేక వివరణ లేకవడం గమనార్హం.

ఇరు దేశాలలో కరోనా పరిస్థితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణల అవసరం లాంటి సమస్యలపై ఇరువురు చర్చించారని ప్రభుత్వ ప్రకటన వివరించింది. జార్జ్ హత్యోందంతపై అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజాందోళనలపై మోదీ ఆందోళన వ్య క్తం చేశారని, సమస్య త్వరగా సమసిపోవాలని ఆకాంక్షించారనీ, అలాగే అమెరికాలో జరిగే జీ7 సదస్సుకు మోదీని ట్రంప్‌ ఆహ్వానించినట్లు పేర్కొంది. ప్రస్తుత సభ్యత్వానికి మించి దీని పరిధిని విస్తరించాలని, భారతదేశంతో సహా ఇతర ముఖ్యమైన దేశాలను చేర్చాలని  కోరుకున్నారని ప్రభుత్వం తెలిపింది. (మోదీపై విశ్వాసం: టాప్‌-5లో సీఎం జగన్)

కాగా  చైనా-భారత్ సరిహద్దు వివాదంపై ఇరుదేశాలు కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం చేయడానికి  సిధ్దమని, దీనిపై మోదీకి ఫోన్ చేస్తే ఆయన మంచి మూడ్ లో లేరని ట్రంప్ గత వారం  ప్రకటించారు. అయితే ఇటీవలి కాలంలో ట్రంప్, మోదీ మధ్య అలాంటి చర్చలేవీ జరగలేదని కేంద్రం స్పష్టతనిచ్చింది. మరోవైపు ఈ సమస్యను సామరస్యపూరకంగా పరిష్కరించుకుంటామని భారత్, చైనా ప్రకటించాయి. అంతేకాదు చైనా మరో అడుగు ముందుకేసి ఈ విషయంలో ట్రంప్ జోక్యం అవసరం లేదని తెగేసి చెప్పింది. అటు కరోనా వ్యాప్తిపైమొదటినుంచీ చైనా మండిపడుతున్న ట్రంప్,  డబ్ల్యూహెచ్‌ఓపై సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  గత వారం సంబంధాలను తెంచుకున్నట్టు ట్రంప్ ప్రకటించిన సంగతి విదితమే. (డబ్ల్యూహెచ్‌ఓతో సంబంధాలు రద్దు : ట్రంప్)

మరిన్ని వార్తలు