మాట ఇస్తున్నా.. ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రతీకారం : మోదీ

16 Feb, 2019 20:06 IST|Sakshi

ముంబై : భారత వీరజవాన్ల కుటుంబాలు, యావత్‌ భారతావని కారుస్తున్న ప్రతీ కన్నీటి బొట్టుకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులను హెచ్చరించారు. శనివారం మహారాష్ట్రలో పర్యటించిన ఆయన... పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన మహారాష్ట్ర జవాన్లు నితిన్‌ రాథోడ్‌, సంజయ్‌ రాజ్‌పుత్‌లకు నివాళులు అర్పించారు.

అనంతరం మోదీ ప్రసంగిస్తూ .. ‘ ఇది సంయమనం పాటించాల్సిన సమయం. అయితే మన జవాన్లను అత్యంత పాశవికంగా అంతమొందించిన వారెవరిని విడిచిపెట్టనని ప్రతీ ఒక్కరికి మాట ఇస్తున్నా. మన సైనికుల పట్ల యావత్‌ భరత జాతికి పూర్తి నమ్మకం ఉంది. వీర జవాన్ల త్యాగమెన్నటికీ వృథా కాదు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా సరే మన సైనికులు వారిని బయటికి లాగి కచ్చితంగా సరైన శిక్షే విధిస్తారు. మన పక్క దేశం ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఈ ఘటన వారి దివాళాకోరుతనం, దిగజారుడుతనాలకు నిదర్శనం. పాపం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు’  అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

కాగా కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఆత్మాహుతి దళసభ్యుడు తన కారుతో.. జవాన్ల కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

మరిన్ని వార్తలు