ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌కు మోదీ పాదాభివందనం!

26 Apr, 2019 16:13 IST|Sakshi

లక్నో : వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం కాలభైరవుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. మోదీ నామినేషన్‌ వేసిన నేపథ్యంలో ఎన్డీఏ నాయకులు వారణాసికి బయల్దేరి వెళ్లారు. నామినేషన్‌ వేయడానికి ముందు కలెక్టరేట్‌ ఆఫీస్‌లో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్, అకాలీదళ్‌ నేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్, ఎల్‌జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం, అప్నాదళ్, నార్త్‌–ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ నేతలతో మోదీ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా 93 ఏళ్ల ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌కు నరేంద్ర మోదీ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తన నామినేషన్‌లో ప్రపోజర్స్‌లో ఒకరైన 92 ఏళ్ల అన్నపూర్ణ శుక్లా కాళ్లకు కూడా నమస్కరించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేసిన మోదీ అభిమానులు.. ‘ భారతీయ సంస్కృతికి అద్దం పట్టారు. మోదీజీ ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌కు పాదాభివందనం చేస్తే.. రాహుల్‌, సోనియాలు మాత్రం వయస్సులో తమకంటే పెద్దవారైన నాయకులు తమ కాళ్లు మొక్కడాన్ని ఆస్వాదిస్తారు. ఇదే రాహుల్‌కు, మోదీకి ఉన్న తేడా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వారణాసిలో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన నరేంద్ర మోదీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఆయన కారుపై పూల వర్షం కురిపించారు. కాలభైరవుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా స్థానిక మహిళలతో మోదీ కరచాలనం చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, పియూష్‌ గోయల్‌ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు