అఖిలేష్ ఇలా.. రాహుల్ అలా

7 Jan, 2017 19:17 IST|Sakshi
అఖిలేష్ ఇలా.. రాహుల్ అలా
రాహుల్‌ గాంధీ - అఖిలేశ్‌ యాదవ్‌ ఇద్దరు ఒకే తరానికి చెందిన నాయకులు. ఇద్దరూ రాజకీయ వారసత్వమున్న కుటుంబాల నుంచి వచ్చినవారే. అనవసర శక్తులు తొలగించి సమాజ్‌వాదీ పార్టీకి ఆధునిక, ప్రగతిశీల ఇమేజ్‌ తేవాలని అఖిలేశ్‌ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. పాతతరంతో పోరాడుతున్న రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ మేకోవర్‌లో భాగంగా అంతర్గత ఎన్నికల ద్వారా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నింపేందుకు కృషి చేస్తున్నారు. ఇద్దరూ ఈ విషయంలో పార్టీలోని కొన్ని శక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోక తప్పడం లేదు. 
 
రాహుల్‌, అఖిలేశ్‌ మధ్య సారూప్యత ఉన్నా అఖిలేశ్‌ నడిచే దారిలో రాహుల్‌ నడవలేరనిపిస్తోంది. పార్టీపై పట్టు కోసం తండ్రి ములాయంతో  అఖిలేశ్‌ పోరాటం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ నుంచి రాహుల్‌కు సంపూర్ణ సహకారముంది. పార్టీ బాధ్యతలన్నీ దాదాపు ఆమె రాహుల్‌కు అప్పగించారు. పార్టీ అధ్యక్షుడిగా  రాహుల్‌ను నియమించేందుకు సోనియా గాంధీ సిద్ధంగా ఉన్నా, ఎందుకో వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. 
 
2012 ఎన్నికల తర్వాత అఖిలేశ్‌ యాదవ్‌ను సీఎం కుర్చీలో ములాయం సింగ్‌ యాదవ్‌ కూర్చోబెట్టినప్పుడు సమాజ్‌వాదీ పార్టీలో ఎవరూ ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే సాహసం చేయలేదు. కానీ రాహుల్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. కుటుంబసభ్యులతో కూడిన సమాజ్‌వాదీ పార్టీతో పోల్చితే కాంగ్రెస్‌లో చెక్స్‌ అండ్‌ బ్యాలెన్స్‌లు కొంచెం ఎక్కువే. పార్టీ మూడ్‌ ధిక్కరించి నిర్ణయం తీసుకునే ధైర్యం కాంగ్రెస్‌ నాయకత్వం చేయలేదు. 
 
పాత తరాన్ని పక్కకు పెట్టే ఉద్దేశం తనకు లేదని రాహుల్ పదే పదే చెప్పడంతో పాటు... వాళ్ల అనుభవం పార్టీకి అవసరమని కూడా అన్నారు. పాతతరంతో రాహుల్‌ గాంధీ ఓ  విధంగా రాజీపడిపోయారనే చెప్పాలి. ఉత్తరాఖండ్‌లో రాజ్యాంగ సంక్షోభమైతేనేమి, పెద్ద నోట్ల రద్దుపై పోరాటం విషయంలోనైతేనేమి అహ్మద్‌ పటేల్‌, గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ వంటి సీనియర్ల సహాయసహాకారాలు రాహుల్‌ గాంధీ తీసుకోవాల్సి వచ్చింది. 
 
అఖిలేశ్‌ విషయానికొస్తే పార్టీపై పట్టు కోసం పార్టీకి వెన్నుదన్నుగా ఉండే బలవంతులను దూరం పెట్టారు. అంతర్గత పోరాటంలో అఖిలేశ్‌ విజయం సాధించారనే చెప్పాలి. కన్న తండ్రిని సైతం ఎదిరించి పార్టీ గుర్తును కైవసం చేసుకునే స్థాయికి అఖిలేశ్ ఎదిగారు. 
 
తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు రాహుల్‌ గాంధీ కూడా చేశారు. గతంలో ఓ ఆర్డినెన్స్‌ను చించేసి కొత్త తరహా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో రాహుల్‌ను ఆయన వ్యతిరేకులు ఆడుకున్నారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేశారు. 
 
రాహుల్‌తో పోల్చితే అఖిలేశ్‌ మంచి మార్కులే కొట్టేశారని చెప్పాలి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా అఖిలేశ్‌ యాదవ్‌  పరిపాలనకు సంబంధించి అనేక లోటుపాట్లు తెలుసుకునే అవకాశం దొరికింది. అఖిలేశ్‌ పాలనతో యూపీ ప్రజలకు పెద్దగా ప్రయోజనం కలగపోయినా ఆయన విశ్వసనీయతకు మాత్రం భంగం కలగలేదు. పరిపాలనలో తండ్రి, బాబాయి పెత్తనాన్ని ఆయన దూరంగా పెట్టారనే మాట ఉత్తరప్రదేశ్‌లో వినిపిస్తోంది. పరిపాలనకు సంబంధించి రాహుల్‌ గాంధీకి ఇప్పటికీ అనుభవం శూన్యమే. 
 
సమర్థ పాలన అందించే నాయకుడిగా అఖిలేశ్‌ యాదవ్‌ తనను తాను ప్రొజెక్టు చేసుకోవడంలో విజయం సాధించారు. ఈ విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలంతా అఖిలేశ్‌ వెంటే ఉన్నట్టు కనిపిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ భవిష్యత్‌ రూపు అఖిలేశేనని ఆ పార్టీ నమ్ముతోంది. 
 
ఈ విషయంలో రాహుల్‌ గాంధీ చాలా వెనుకబడే ఉన్నారు. పార్టీని ముందుండి నడిపించగలననే నమ్మకం రాహుల్‌ గాంధీ ఇంకా కాంగ్రెస్‌ కేడర్‌కు కలిగించలేదనే చెప్పాలి. అఖిలేశ్‌ తనంతట తానుగా నాయకుడిగా ఎదిగారన్నది వాస్తవం. ఈ విషయంలో రాహుల్‌ గాంధీ ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు.
>
మరిన్ని వార్తలు