ఫేస్ బుక్ పోస్ట్ అతడి జీవితాన్నే మార్చేసింది..

29 Sep, 2015 17:12 IST|Sakshi
ఫేస్ బుక్ పోస్ట్ అతడి జీవితాన్నే మార్చేసింది..

నోయిడా:  ఓ ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు...ఓ బాలుడికి సోషల్ మీడియా ఫేస్ బుక్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఓ ప్రయాణికుడు చేసిన ఒక ఫేస్ బుక్ పోస్టు ఆ బాలుడి పాలిట వరంగా మారింది. అతడికి సహాయం చేయాలంటూ చేసిన విన్నపం ఏకంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను చేరింది.

వివరాల్లోకి వెళితే... 13 ఏళ్ల హరేంద్రసింగ్ నోయిడాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అనుకోకుండా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో నోయిడాలోని మెట్రో స్టేషన్లో బరువు కొలిచే యంత్రం పక్కన పెట్టుకొని, స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చొని  హోం వర్క్ చేసుకునే వాడు. ఆ దారిలో ఎవరైనా బరువు తెలుసుకోవాలనుకునే వాళ్లు అక్కడికి వచ్చి చిల్లర వేసి బరువు కొలుచుకునే వాళ్లు. అలా వచ్చిన డబ్బుతో పుస్తకాలు,పెన్నులు, చదువుకోవడానికి అవసరమైన సామగ్రిని కొనుక్కునే వాడు.

నోయిడాకి చెందిన వికాస్ షర్ధా అనే ప్రయాణికుడు ఒక రోజు స్టేషన్ నుంచి బయటకి వస్తున్నసమయంలో ఆ అబ్బాయిని చూశాడు. వెంటనే ఫోటో తీసి... 'ఎవరైతే నోయిడా మెట్రో స్టేషన్ గుండా రాత్రి 7 గంటల తర్వాత ప్రయాణాలు చేస్తారో..వాళ్లు ఆ బాలుని దగ్గర బరువు చూసుకుని అతని చదువు కోసం సహాయం చేయండి... దయచేసి అతడిని ఎవరూ అడుక్కునే వాడిలా చూడకండి..అంటూ'  ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. అంతే.. ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చివరికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలే యాదవ్ దృష్టిలో హరేంద్రసింగ్ పడ్డాడు. అతనికి ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటూ చదువుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

'జూన్లో మానాన్న  ఉద్యోగాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గత నెలన్నర నుంచి నోయిడా మెట్రో స్టేషన్కు రాత్రి 7 గంటకు వచ్చి కొంత డబ్బును సంపాదిస్తున్నాను. అలా వచ్చిన డబ్బుతో చదువుకోవడానికి అవసరమయ్యే స్టేషనరీ సమాన్లు కొనుక్కుంటున్నాను' అని హరేంద్రసింగ్ చెప్పాడు. రోజు రూ. 70 లేదా అప్పడప్పుడు అంతకన్నా తక్కువగా వచ్చేవని తెలిపాడు. అతని సమస్య గురించి అందరికీ తెలిసేలా ఫోటో తీసి షేర్ చేసినందుకు వికాస్కు కృతజ్ఞతలు తెలిపాడు.

మరిన్ని వార్తలు