-

కొద్ది దూరంలో మసీదు నిర్మించొచ్చు

9 Aug, 2017 01:21 IST|Sakshi
కొద్ది దూరంలో మసీదు నిర్మించొచ్చు

అయోధ్య కేసు పరిష్కారానికి సుప్రీంకోర్టుకు వక్ఫ్‌బోర్డు సూచన
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం–బాబ్రీ మసీదు సమస్యకు పరిష్కారంగా వివాదాస్పద స్థలానికి కొంచెం దూరంలో మసీదును నిర్మించవచ్చని ఉత్తరప్రదేశ్‌ షియా కేంద్ర వక్ఫ్‌బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే బాబ్రీ మసీదు స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు తమదని చెప్పుకుంటుండటాన్ని షియా వక్ఫ్‌బోర్డు వ్యతిరేకించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దీనిని ప్రస్తావిస్తూ మసీదు స్థలం తమదేననీ, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపే హక్కు తమకే ఉందని షియా వక్ఫ్‌బోర్డు పేర్కొంది.

కొత్తగా నిర్మించే మసీదు, ఆలయం తగినంత దూరంలో ఉండాలనీ, ప్రార్థనా స్థలాల్లో ఒకమతం వారు వాడే లౌడ్‌ స్పీకర్ల వల్ల మరో మతం వారికి ఇబ్బంది ఉండకూడదని వక్ఫ్‌బోర్టు కోర్టుకు విన్నవించింది. రామ జన్మభూమి–బాబ్రీ మసీదు కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖారా, రామ మందిరాలకు పంచుతూ అలహాబాద్‌ హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ పిటిషన్లను త్వరగా విచారించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును గతంలో కోరారు. దీంతో పిటిషన్లపై విచారించేందుకు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ ఇటీవల నియమించారు.


 

మరిన్ని వార్తలు