’నేను, అమ్మమ్మ, వాళ్లమ్మ కూడా బాధితులమే’

13 Dec, 2016 16:04 IST|Sakshi
’నేను, అమ్మమ్మ, వాళ్లమ్మ కూడా బాధితులమే’
న్యూఢిల్లీ: తమ కన్నబిడ్డలతో అభ్యంతరకర విషయాలు చర్చించేందుకు, అసభ్యంగా అనిపించే పదాలు ఉపయోగించేందుకు ఏ తల్లిదండ్రులు ముందుకురారు. అయితే, ఇలాంటి విషయాలు పిల్లలతో చర్చించకపోవడం వల్లే వారికి అవగాహన లేకుండాపోయి సమాజంలో మరోచోట అసభ్యతకు పాల్పడుతున్నారని కొందరి అభిప్రాయం. అయినప్పటికీ ఈ విషయాలు నేరుగా వారితో చర్చించరు. కానీ, ఇటీవల కాలంలో తల్లులు తమ పాత్రను పోషించడంతోపాటు.. తమ పిల్లలు సమాజంలో నడుచుకోవాల్సిన తీరును, పక్కవారికి ఎలా ఆదర్శంగా ఉండాలో అనే విషయాలను ధైర్యంగా నేర్పిస్తున్నారు.

అందుకోసం ఇంట్లోగానీ, పాఠశాలల్లోగానీ నేరుగా చర్చించని అంశాలు కూడా వారితో చర్చిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులకు సంబంధించి ఢిల్లీలోని ఎనిమిదిమంది మహిళలు తమ కన్న బిడ్డలకు నేరుగా లేఖలు రాశారు. అందులో వారు, వారి తల్లులు, తల్లుల తల్లులు యుక్త వయసులో నుంచి ఇప్పటి వరకు పడుతున్న వేధింపులను చర్చించారు. అలా పంపించిన వారిలో ప్రీతి అగర్వాల్‌ మెహతా అనే ఓ గృహిణీ తన పదిహేనేళ్ల కుమారుడు సుయాంశ్‌తో ఓ లేఖలో కొన్ని వాస్తవాలు పంచుకుంది. దేశంలో మహిళలపై ఆగఢాలు, ఈవ్‌ టీజింగ్‌, లైంగిక వేధింపులు, అత్యాచారం, వేధింపులు జరుగుతున్నాయని చెప్పింది.

వారి వయసుతో, ఆర్థిక స్థితిగతులతో, వివాహం అంశంతో సంబంధం లేకుండానే వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయని తెలిపింది. ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు కొంత ఇబ్బందిగా అనిపించినా ఇవన్నీ కూడా చాలా సార్లు తాను ఎదుర్కొన్నవేనని, తనకంటే ముందు తన తల్లి కూడా వేధింపులు అనుభవించాల్సి వచ్చిందని చెప్పింది. డిసెంబర్‌ 16, 2012లో ఢిల్లీలో నిర్భయపై జరిగిన లైంగికదాడి గురించి వివరిస్తూ సమాజంలో బాగా నడుచుకోవాలని తెలిపింది. బాలికలతో మాట్లాడేసమయంలో వారికి కొంత గౌరవాన్ని ఇవ్వాలని, వ్యక్తిగత స్వేచ్చను అడ్డుకోవద్దని చెప్పింది. మహిళలపై జరిగే వేధింపుల విషయంలో ఇప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలని ఆ లేఖలో కోరుతూ పలు విషయాలు చెప్పింది.
మరిన్ని వార్తలు