జలాశయాల అభివృద్ధికి కొత్త విధానం

28 Jun, 2014 02:37 IST|Sakshi
జలాశయాల అభివృద్ధికి కొత్త విధానం

నగరవ్యాప్తంగా ఉన్న జలాశయాలను పునరుద్ధరించేందుకు వివిధ స్వచ్ఛందసంస్థల (ఎన్జీఓ) నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన డీడీఏ, చివరికి నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. జలాశయాల పునరుద్ధరణ, పరిరక్షణ, నిర్వహణ కోసం ఇవి కార్పొరేట్ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సేకరిస్తాయి.

 - ఉమ్మడి భాగస్వామ్యంలో ప్రాజెక్టులు
- డీడీఏ నిర్ణయం

న్యూఢిల్లీ: తన అధీనంలో ఉన్న 63 జలాశయాలు/జలవనరుల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో చేపట్టాలని ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) భావిస్తోంది. ఇందుకోసం వివిధ స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓ) నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన డీడీఏ, నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. పురాతన కట్టడాల సంరక్షణ కోసం పనిచేసే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) కూడా ఇందులో ఉందని డీడీఏ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

ఇది వరకే మథుర, బృందావన్‌లో పనిచేసే బ్రజ్ ఫౌండేషన్, కేరళలో సరస్సును శుద్ధీకరించే సామర్థ్య, ఫోరం ఫర్ ఆర్గనైజ్డ్ రిసోర్సెస్ కన్సర్వేషన్ అండ్ ఎన్హాన్స్‌మెంట్ (ఫోర్స్) అనే మూడు ఎన్జీఓలను కూడా డీడీఏ ఎంపిక చేసింది. ఫోర్స్ ఇది వరకే ఢిల్లీలోని పలు జలవనరుల పునరుద్ధరణ కోసం పనిచేసింది. ఈ నాలుగు స్వచ్ఛంద సంస్థలు త్వరలోనే 63 జలాశయాలను పరిశీలించి తమ ప్రతిపాదనలను సమర్పిస్తాయి.

ప్రతి ప్రాజెక్టుకూ డీడీఏ స్వచ్ఛంద సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది. జలాశయాల పునరుద్ధరణ, పరిరక్షణ, నిర్వహణ కోసం ఈ స్వచ్ఛందసంస్థలు కార్పొరేట్ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సేకరిస్తాయి. డీడీఏ కూడా ఈ పనుల్లో పాల్గొంటుంది. ఒక్కో సంస్థ సామర్థ్యం, ఆసక్తి, సౌలభ్యాన్ని బట్టి సంబంధిత ప్రాజెక్టు కేటాయిస్తామని డీడీఏ అధికారులు తెలిపారు.

ఒకే ప్రాజెక్టుపై బహుళ ఎన్జోఓలు ఆసక్తి చూపిస్తే తుది ఎంపిక నిర్వహణకు ప్రత్యేక విధానాన్ని ఎంచుకుంటామని చెప్పారు. ఈ సంస్థలు తమ ప్రాధాన్యాలను వెల్లడించగానే ప్రాజెక్టుల కేటాయింపును మొదలుపెడతామని డీడీఏ సీనియర్ అధికారి ఒకరు వివరించారు.

మరిన్ని వార్తలు