నీళ్ల లొల్లిపై కమిటీ

24 Jun, 2016 03:03 IST|Sakshi
  • కృష్ణాపై ఏకాభిప్రాయం రాకపోవడంతో కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయం
  •  ముగ్గురు సీడబ్ల్యూసీ రిటైర్డ్ చైర్మన్లతో అధ్యయనం
  •  కేఆర్‌ఎంబీపై మార్గదర్శకాలు రూపొందించనున్న కమిటీ.. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రం సూచన..
  •  మూడోరోజు చర్చల్లోనూ ప్రతిష్టంభన
  •  90 టీఎంసీల వాటాకు తెలంగాణ పట్టు.. వ్యతిరేకించిన ఏపీ
  •  అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి: హరీశ్‌రావు
  •  టెలిమెట్రిక్ విధానం పెట్టి ప్రతి చుక్కనూ లెక్కించాలని డిమాండ్
  •  
    సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంచాయితీ మూడోరోజు కూడా ఎటూ తేలలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంత్రులూ ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉండటంతో జగడం తెగలేదు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సూచనల మేరకు గురువారం ఉదయం జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్‌జిత్ సింగ్ సమక్షంలో ఇరురాష్ట్రాల నీటి పారుదల మంత్రులు టి.హరీశ్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు సమావేశమయ్యారు. గడచిన రెండ్రోజులుగా ఉన్నతాధికారులు చేసిన వాదనలనే మంత్రులూ వినిపించారు. గోదావరి నుంచి పోలవరం, పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి మళ్లించిన నీటిలో తమ వాటాగా 90 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ పట్టుపట్టగా.. దాన్ని ఏపీ వ్యతిరేకించింది. నాగార్జున సాగర్ కుడికాలువ తమ భూభాగంలో ఉన్నందున తామే నిర్వహించుకుంటామని ఏపీ వాదించగా అది కుదరదని, అన్ని ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి తీసుకురావాల్సిందేనని తెలంగాణ వాదించింది. ఈ చర్చల్లో ఏదీ తేలే పరిస్థితి లేదని    భావించిన కేంద్రం చివరకు... కేఆర్‌ఎంబీ నోటిఫికేషన్ జారీకి ముందు మార్గదర్శకాలను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చింది.

    జూలై మొదటి వారంలో కేంద్ర జల వనరుల సంఘం మాజీ చైర్మన్లు ముగ్గురితో ఒక కమిటీ వేస్తామని, రెండు మూడు నెలల్లో ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందిస్తుందని, ఆ తర్వాత కేఆర్‌ఎంబీ పరిధి, అధికారాలు నిర్ణయిస్తామని తెలిపింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగాలని సూచించింది. అందుకు తెలంగాణ అంగీకరించింది. ఏపీ కూడా సాధ్యమైనంత త్వరగా ఆ కమిటీ మార్గదర్శకాలు రూపొందించాలని, అందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది. అయితే యథాతథ స్థితిని కేవలం నెలరోజులకే పరిమితం చేయాలని కోరింది. తాత్కాలిక యాజమాన్య ఏర్పాట్లపై నెల రోజుల్లోగా ఏకాభిప్రాయానికి రాని పక్షంలో మరోసారి ఇరుపక్షాలు సమావేశమయ్యే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన అనంతరం ఇద్దరు మంత్రులు విడివిడిగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు.
     
     అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి: హరీశ్‌రావు
     సమావేశంలో ఎలాంటి స్పష్టత రాలేదు. ఏపీది అదే మొండి వైఖరి. నిరంకుశంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా వితండ వాదన చేస్తోంది. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటికే బచావత్ అవార్డు స్పష్టత ఇచ్చింది. గోదావరి నీళ్లను కృష్ణాకు మళ్లిస్తే పైరాష్ట్రాలకు హక్కులు ఉంటాయని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పినందున... తెలంగాణ వాటా కింద 90 టీఎంసీలు ఇవ్వాలి. తాత్కాలిక అవగాహన ప్రకారం వచ్చిన 299 టీఎంసీలు కూడా చాలా తక్కువే. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది కేటాయింపులు ఇచ్చే వరకు చేయగలిగిందేమీ లేనందున.. బచావత్ అవార్డు అందుబాటులో ఉన్నందున దాన్ని అమలు చేయాలి. 299 టీఎంసీలకు అదనంగా 90 టీఎంసీలు కేటాయించాలని కోరాం. ఏపీ అందుకు అంగీకరించలేదు. జూలై మొదటి వారంలో ముగ్గురు రిటైర్డ్ సీడబ్ల్యూసీ చైర్మన్లతో కమిటీ వేసి వచ్చే మూడు నెలల్లోగా కేఆర్‌ఎంబీని నిర్వహణలోకి తెస్తామని కేంద్రం చెప్పింది. ఈ మూడు నెలలపాటు యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రం  అభ్యర్థించింది. మేం అందుకు సమ్మతించాం. కానీ ఏపీ అందుకు అంగీకరించని పరిస్థితి ఉంది.

    అనేక సమస్యలకు పరిష్కారం వచ్చాకే కేఆర్‌ఎంబీ విధులు నిర్వర్తించగలుగుతుంది. దాన్ని నిర్వహణలోకి తేవడంలో మాకు అభ్యంతరం లేదు. కానీ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తేవాలి. అప్పుడు మాకు అభ్యంతరం ఉండదు. టెలీమెట్రిక్ విధానం పెట్టండి. సంయుక్త బృందాలను ఏర్పాటు చేయండి. ప్రతి చుక్కను కూడా లెక్కపెడితే రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి మేం సిద్ధంగా ఉన్నామని మేం చెప్పాం. మేం మహారాష్ట్ర, కర్ణాటకతో కలిసి పనిచేయగలుగుతున్నాం. కానీ ఏపీ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. తెలంగాణకు అన్యాయం జరిగితే ఢిల్లీ స్థాయిలో పోరాడుతాం. న్యాయస్థానంలో పోరాడుతాం. ఏపీకి సంబంధించి ఒక చుక్క కూడా మాకు అవసరం లేదు. మా హక్కుల కోసం మేం కొట్లాడుతాం.
     
    నీటి నిర్వహణలో ఇబ్బందులను వివరించాం: దేవినేని ఉమామహేశ్వరరావు
    కేంద్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీ పరిధిని ప్రకటించాలి. సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులతో దీనిపై కమిటీ వేస్తానంది. త్వరితగతిన మార్గదర్శకాలు విడుదల చేసి కేఆర్‌ఎంబీ నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. నెల రోజుల తాత్కాలిక ఏర్పాట్లపై మరోసారి చర్చలకు పిలుస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ సీఈ ఆధ్వర్యంలో ఉన్నా.. ప్రాజెక్టులోకి నీళ్లు రాగానే తెలంగాణ కేఆర్‌ఎంబీ ఆదేశాలు పట్టించుకోకుండా విద్యుదుత్పత్తి చేస్తోందని చెప్పాం. రాయలసీమకు మంచినీళ్లు ఇవ్వకుండా విద్యుత్ కోసం గేట్లు ఎత్తేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడికాల్వ వద్ద మా ఎస్పీఎఫ్‌ను పెట్టుకుంటామని చెబితే.. మొండిగా, తొండిగా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు కేటాయించిన నీళ్లు వాళ్లు ఉపయోగించుకోవాలి. మొండిగా ఒకసారి 45 టీఎంసీలు, తొండిగా మరోసారి 90 టీఎంసీలు అంటున్నారు.

>
మరిన్ని వార్తలు