అధికార ప్రతినిధిగా థరూర్‌కు ఉద్వాసన

14 Oct, 2014 00:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పథకాలను పొగిడిన మాజీ మంత్రి శశిథరూర్‌పై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన్ను తక్షణం అధికార ప్రతినిధి హోదా నుంచి తొలగిస్తూ సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం చేసిన సిఫార్సుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం తెలిపారు. శశిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేరళ పీసీసీ ఫిర్యాదు చేసిందని పార్టీ జనరల్ సెక్రటరీ జనార్దన్ ద్వివేదీ విలేకరులకు తెలిపారు.

మోదీని శశి కీర్తించడం కేరళ కాంగ్రెస్ కార్యకర్తల్ని బాధించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని ద్వివేదీ వెల్లడించారు. అయితే శశి పార్టీలోనే కొనసాగుతారని పార్టీ ప్రతినిధి శోభా ఓజా తెలిపారు. విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఆయన ఇంకా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అధిష్టానం చర్యల్ని క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఆహ్వానిస్తున్నానని శశిథరూర్ చెప్పారు.
 

మరిన్ని వార్తలు