దాంపత్య బంధాన్ని నిలబెట్టిన మరుగుదొడ్డి !

11 May, 2015 02:53 IST|Sakshi
దాంపత్య బంధాన్ని నిలబెట్టిన మరుగుదొడ్డి !

జయ్‌ఘట(పశ్చిమ బెంగాల్): పచ్చగా సాగుతున్న ఆ కాపురంలో మరుగుదొడ్డి లేకపోవడంతో అనుమానాలు, గొడవలు రేగాయి. తెగతెంపుల దాకా వచ్చిన ఆ దాంపత్య బంధాన్ని చివరకు మరుగుదొడ్డే కాపాడింది! పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లా మాజ్దియా గ్రామానికి చెందిన దినకూలీ జయగోబింద మండల్‌కు రింకుతో 2001లో పెళ్లయింది. రెండేళ్ల కిందట కాపురంలో కలతలు తలెత్తాయి. బహిర్భూమికి వె ళ్తున్న భార్య గంటల కొద్దీ అక్కడే ఉంటోందని, ఆమెకు ఎవరితోనో సంబంధముందని మండల్ అనుమానించసాగాడు.

అలాంటిదేమీ లేదు మొర్రో అని భార్య మొత్తుకుంది. భర్త వినకుండా తాగొచ్చి ఆమెను కొట్టడం మొదలెట్టాడు. రింకు పుట్టింటికెళ్లి కోల్‌కతా హైకోర్టులో భర్తపై గృహహింస కేసు పెట్టింది. అయితే మరుగుదొడ్డి లేకపోవడంతో తమ మధ్య గొడవలకు కారణమని దంపతులు తెలుసుకున్నారు. 'అందరి మరుగుదొడ్లు' పథకం కింద తమ ఇంటి ఆవరణలో ఉచింతగా టాయలెట్ కట్టించుకున్నారు. కాపురం నిలబడింది. ''బహిర్బూమికి వెళ్లినప్పడు సురక్షితమైన, మరుగుండే స్థలం కోసం వెతికే దాన్ని. దీంతో కాస్త ఆలస్యమయ్యేది. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. టాయిలెట్ వచ్చాక సంతోషంగా ఉన్నాం'' అని రింకూ నవ్వుతూ చెప్పింది. నాడియా జిల్లాలో లక్షలాది టాయిటెట్లు కట్టించిన అధికారులు జిల్లాను 'బహిరంగ మలవిసర్జన' లేని జిల్లాగా ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు