'రజినీ పార్టీ లేదు.. రాజకీయాల్లోకి రావట్లేదు'

10 Feb, 2017 17:37 IST|Sakshi
'రజినీ పార్టీ లేదు.. రాజకీయాల్లోకి రావట్లేదు'

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్‌ కొత్త పార్టీ ఏర్పాటు అనేది అవాస్తం అని ఆరెస్సెస్‌ సిద్ధాంత కర్త గురుమూర్తి స్పష్టం చేశారు. ఆయన బీజేపీతో చర్చలు జరుపుతున్నారంటూ వస్తున్న ప్రచారమంతా ఓ కట్టుకథ, అభూత కల్పన అని ఆయన కొట్టిపారేశారు. రజినీకాంత్‌ కొత్త పార్టీతో వస్తున్నారని, ఆమేరకు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, వీరిద్దరి మధ్య ఆరెస్సెస్‌ సిద్ధాంత కర్త గురుమూర్తి సయోధ్య కుదురుస్తున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో స్పందించి గురుమూర్తి.. మీడియాలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రసారం చేస్తారో అర్థం కావడం లేదన్నారు. కొంతమంది కావాలనే పనిగట్టుకొని ఈ అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్‌ చేశారు. అసలు రజినీ రాజకీయ ఆరంగేట్రం పూర్తిగా అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు.

తమిళనాడు రాజకీయ పరిస్థితులు చూసి రజినీకాంత్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, ఈ నేపథ్యంలో కొత్త పార్టీతో వస్తారని తొలుత సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. పవర్‌ అంటే తనకు ఇష్టమని రజినీ చెప్పడం కూడా అందుకు కారణం అయింది. అదే సమయంలో గురుమూర్తి ద్వారా బీజేపీతో సయోధ్య కుదుర్చుకొని కొత్త పార్టీతో రజినీ వస్తున్నారంటూ తాజాగా వార్తలు వచ్చి ధుమారం రేపాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు