బిడ్డ కోసం చిరుతతోనే పోరాడిన తల్లి

9 Dec, 2015 17:31 IST|Sakshi
బిడ్డ కోసం చిరుతతోనే పోరాడిన తల్లి
లక్నో: అమ్మ అంటే నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడమే కాదు.. కలకాలం వెన్నంటి కాపాడే అమృతమూర్తి. కాలయముడే ముందు నిలబడినా  బిడ్డల కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పోరాడే దేవత.. ఉత్తర ప్రదేశ్ కు చెందిన  ఓ మాతృమూర్తి ఈ విషయాలను మరోసారి రుజువు చేసింది. అకస్మాత్తుగా దాడిచేసి తన బిడ్డను నోట కరుచుకొని పోతున్న చిరుతతో ధైర్యంగా పోరాడింది. అత్యంత సాహసంగా వ్యవహరించి క్రూర జంతువు సైతం తోక ముడిచేలా చేసింది.
 
కాట్రాయన్ ఘాట్ గ్రామానికి చెందిన ఫూల్మతి (30) తన ఇద్దరు ఆడబిడ్డల్ని తీసుకుని పొలానికి బయలుదేరింది. అంతలో అక్కడకు దగ్గర్లో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం లోంచి వచ్చిన చిరుత వాళ్లపై దాడిచేసి, నాలుగేళ్ల గుడియాను ఈడ్చుకుంటూ పారిపోవడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా షాకైన ఫూల్మతి.. క్షణం ఆలస్యం చేయకుండా.. సాయం కోసం బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. పొద్దునే కావడంతో  ఆ చుట్టుపక్కల ఎవరూ స్పందించలేదు. అయినా పెద్దగా కేకలు వేస్తూ.. చేతికి దొరికిన రాళ్లు, కర్రలతో చిరుతను కొట్టడం మొదలుపెట్టింది. దాదాపు అరగంటపాటు ఆ చిరుతపై ఒంటరి పోరాటం చేసింది. తర్వాత ఆమె కుటుంబసభ్యులు ఆమెకు తోడయ్యారు. చివరకు చిరుత బారినుంచి ఆ పాపను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా, మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి.
మరిన్ని వార్తలు