‘ఆయుష్మాన్‌’కు ఆధార్‌ తప్పనిసరి కాదు

13 Jul, 2018 03:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం – ఆయుష్మాన్‌ భారత్‌కు ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు కేంద్రం గురువారం వెల్లడించింది. పథకానికి ఆధార్‌ తప్పనిసరి మాత్రం కాదని స్పష్టం చేసింది.

జాతీయ ఆరోగ్య బీమా పథకంలో భాగంగా లబ్ధిదారులు ఆధార్‌ను తప్పనిసరిగా చూపించాల్సిందేనంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సరైన లబ్ధిదారులను గుర్తించే విషయంలో ఆధార్‌ కార్డును చూపించాలి. ఇది తప్పనిసరేం కాదు. ఆధార్‌ లేదంటూ లబ్ధిదారుడికి చికిత్సను తిరస్కరించడం జరగదు’ అని కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. ‘ఆధార్‌ కార్డులతో సంబంధం లేకుండా అందరు లబ్ధిదారులకు మేం సేవలందిస్తాం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు