కరోనా ఎఫెక్ట్‌; వైద్యానికీ ఆధార్‌!

8 Jun, 2020 09:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వైద్యం చేయించుకోవాలంటే వ్యక్తిగత గుర్తింపు పత్రాలు తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి అవసరమైన గుర్తింపు పత్రాల జాబితాను ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. కొన్ని ప్రత్యేక శస్త్రచికిత్సలకు వీటి నుంచి మినహాయింపు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి పద్మిని సింగ్లా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 

హస్తిన ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలనుకునే వారు ఓటర్‌ ఐటీ, బ్యాంక్‌, పోస్టాఫీస్‌ పాస్‌బుక్‌, రేషన్ కార్డు, పాస్‌పోర్టు, ఆదాయపు పన్ను రిటర్న్, డ్రైవింగ్‌  లైసెన్స్‌, టెలిఫోన్, వాటర్‌, విద్యుత్ బిల్లులు.. వీటిలో ఏదోటి సమర్పించాల్సి ఉంటుంది.  రోగి తల్లిదండ్రులు, భాగస్వాములకు సంబంధించిన ఇవే పత్రాలను కూడా ఆమోదిస్తారు. రోగి ఇచ్చిన చిరునామాకు వచ్చిన పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ పత్రాలను కూడా వ్యక్తిగత ధ్రువీకరణగా పరిగణిస్తారు. జూన్ 7కి ముందు జారీ చేసిన ఆధార్ కార్డు మాత్రమే చెల్లుతుంది. రోగి మైనర్ అయితే తల్లిదండ్రుల పేరిట జారీ చేసిన ధ్రువపత్రాలను ఆస్పత్రులు అనుమతిస్తాయని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 

ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని  90 శాతం ప‌డ‌క‌లు స్థానికుల‌కే కేటాయించాల‌ని కేజ్రీవాల్‌ సర్కారు  నిర్ణయించింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఇప్పటివరకు 27,654 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 761 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్‌ బారి నుంచి 10,664 మంది కోలుకోగా, 16,229 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ( కేజ్రీవాల్ కీల‌క‌ నిర్ణ‌యం)

మరిన్ని వార్తలు