వదంతులకు ‘ఆధార్‌’తో చెక్‌

1 Sep, 2019 04:07 IST|Sakshi

నర్సింగ్‌పూర్‌: పిల్లలను ఎత్తుకుపోయేవాళ్లు తిరుగుతున్నారన్న ఫేక్‌ వార్తలు మధ్యప్రదేశ్‌ గ్రామాల్లో కొన్నిరోజులుగా ఆందోళన రేకెత్తిస్తూండగా.. ఈ సమస్యను అధిగమించేందుకు జమార్‌ గ్రామ ప్రజలు ఓ వినూత్నమైన ప్రయత్నం మొదలుపెట్టారు. అన్ని రకాల పనులకు ఆధార‘భూతం’గా నిలిచిన ఆధార్‌ కార్డు లేనిదే గ్రామంలోకి ఎవరినీ అనుమతించేది లేదని భీష్మించారు ఈ గ్రామస్తులు. ఆధార్‌ లేదా అలాంటి ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే తమ గ్రామంలోకి అడుగుపెట్టాలని వీరు స్పష్టం చేస్తున్నారు.

పిల్లలను ఎత్తుకుపోయే వాళ్లు తిరుగుతున్నారన్న పుకార్లు రావడంతో గ్రామ సేవకులు కొందరు ఇంటింటికీ తిరిగి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా.. సోషల్‌మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకున్న తరువాతే ఫార్వర్డ్‌ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆధార్‌ ఆధారంగా అపరిచితులను గుర్తించడం గ్రామంలో మొదలైంది. ఈ పని మొదలుపెట్టిన తరువాత  ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని గ్రామస్తులు తెలిపారు.

మరిన్ని వార్తలు