ఆన్ లైన్ టికెట్‌ బుకింగ్‌కూ ఆధార్‌

3 Mar, 2017 01:26 IST|Sakshi
ఆన్ లైన్ టికెట్‌ బుకింగ్‌కూ ఆధార్‌

త్వరలో అమలు చేయనున్న రైల్వే శాఖ
►  నగదు రహితమే లక్ష్యంగా నూతన ప్రణాళిక
►  ప్రయాణ సర్వీసులన్నీ పొందేందుకు మొబైల్‌ అప్లికేషన్


న్యూఢిల్లీ: రైల్వే ఆన్ లైన్‌ టికెట్ల కొనుగోలులో అక్రమాలను నిరోధించడానికి ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరి చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఐఆర్‌సీటీసీ వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఆధార్‌ను తప్పనిసరి చేయనుంది. దీనివల్ల బల్క్‌ టికెట్ల బుకింగ్‌లను అరికట్టడంతోపాటు మరొకరి పేరుతో టికెట్‌ బుకింగ్‌ చేయడాన్ని కూడా అడ్డుకోవచ్చు.

సీనియర్‌ సిటిజన్లు రైల్వే టికెట్లలో రాయితీ పొందేందుకు ఏప్రిల్‌ 1 నుంచి ఆధార్‌ తప్పక సమర్పించాలని రైల్వే శాఖ ఇప్పటికే ఆదేశిం చింది. దీన్ని మూడు నెలల పాటు ప్రయోగా త్మకంగా అమలు చేయనుంది. రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు రైల్వేశాఖ 2017–18 కొత్త బిజినెస్‌ ప్లాన్ ను గురువారం ప్రవేశపెట్టారు. ఇందులో ఆధార్‌ తప్పనిసరి చేయడంతోపాటు నగదు రహిత టికెట్ల కొనుగోలు లక్ష్యంగా అడుగులు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఆరు వేల పీవోఎస్‌ మెషీన్లను, వెయ్యి ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

మేలో టికెటింగ్‌ యాప్‌: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు టికెటింగ్‌ యాప్‌ను కూడా రైల్వేశాఖ మేలో ఆవిష్కరించనుంది. అంతేకాదు ఐఆర్‌సీటీసీలో నమోదుకు ఆధార్‌ను తప్పనిసరి చేసేలా ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నట్లు రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. పర్వత ప్రాంతాలకు చేరుకునేలా కొత్త టూరిస్టు రైళ్లను ఆవిష్కరించనున్నట్లు తాజా ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో ప్రయాణికులకు వసతి సదుపాయాలు, కేటరింగ్‌ సర్వీస్‌ మెరుగుపరచడం ద్వారా ప్రయాణం ఆహ్లాదకరంగా సాగేలా చేయాలని నిర్ణయించారు.

ఒకే యాప్‌.. సేవలెన్నో..
రైల్వేశాఖ త్వరలో సమగ్ర మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకూ టికెట్ల కొనుగోలు, ట్యాక్సీల బుకింగ్, ఈ కేటరింగ్‌ తదితర సర్వీసులకు వేర్వేరు యాప్‌లు ఉన్నాయి. అయితే కొత్త యాప్‌ ద్వారా ఈ సర్వీసులన్నీ పొందవచ్చని ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న రైల్వే శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ యాప్‌ ద్వారా రిజర్వ్‌డ్, అన్  రిజర్వ్‌డ్, సీజన్  టికెట్లతో పాటు ప్లాట్‌ఫామ్‌ టికెట్లనూ కొనుగోలు చేయవచ్చు. 

మరిన్ని వార్తలు