రైల్వేలో ఆధార్‌తో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌

5 Nov, 2017 17:50 IST|Sakshi

హైదరాబాద్‌: రైల్వే కార్యాలయాల్లో 2018 జనవరి 31 నుంచి ఉద్యోగులకు ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్‌ హాజరును అమలు చేయనున్నారు. ఆలస్యంగా హాజరయ్యేవారిని కనిపెట్టేందుకు జనవరి 31కల్లా ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్‌ సిస్టంను రైల్వే జోన్లు, డివిజనల్‌లలో ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈమేరకు రైల్వే బోర్డు నవంబర్‌ 3న అన్ని జోన్లకు లేఖలు పంపింది. మొదటగా అన్ని డివిజనల్‌, జోనల్‌, కోల్‌కతా మెట్రో రైలు, రైల్వే వర్క్‌షాపులు, కర్మాగారాలు, ఉత్పత్తి యూనిట్లలో నవంబర్‌ 30కల్లా అమలు చేయాలని ఆ లేఖలో ఆదేశించారు.

విధులకు ఆలస్యంగా వచ్చే, అసలు రాని అధికారులపై ఈ విధానంతో నిఘా ఉంచాలన‍్నది ఉద్దేశమని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. రెండో విడతగా అన్ని రైల్వే అండర్‌ టేకింగ్‌, అటాచ్‌డ్‌, సబార్డినేట్‌ కార్యాలయాల్లో జనవరి 31కల్లా అమలు చేస్తారు. ఇప్పటికే ఈ పద్ధతి రైల్వే బోర్డు, కొన్ని జోన్ల ప్రధాన కార్యాలయాల్లో అమలులో ఉంది. ఈ కొత్త హాజరు పద్ధతిని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం పర్యవేక్షించాలని ఆ లేఖలో రైల్వే బోర్డు తెలిపింది. దీంతోపాటు సీసీ టీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు