రాయితీలకు ‘ఆధార్’ తప్పనిసరి కాదు

24 Aug, 2013 05:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాల ద్వారా వంటగ్యాసుతోపాటు ఇతర రాయితీలు పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్రం శుక్రవారం రాజ్యసభకు వెల్లడించింది. ఏవైనా ప్రభుత్వ శాఖలు ఆధార్‌ను తప్పనిసరి చేస్తే గనక.. దానిని తాము సరిచేస్తామని ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ శుక్లా తెలిపారు. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, పాఠశాలల్లో ప్రవేశాలకు, పాస్‌పోర్టు పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాకున్నా.. కొన్ని ప్రభుత్వ శాఖలు ఒత్తిడి చేస్తున్నాయన్న సభ్యుల ఆందోళనకు మంత్రి సమాధానమిచ్చారు.
 
 ఉల్లి ఎగుమతుల నిషేధాన్ని పరిశీలించడం లేదు...
 ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడంపై ఎలాంటి ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలించడంలేదని ఆహార మంత్రి కేవీ థామస్ రాజ్యసభకు తెలిపారు. ఉల్లి ధరలకు ఎగుమతులు కారణం కాదని, నిషేధాన్ని పరిశీలించడం లేదన్నారు.
 
 దభోల్కర్‌కు నివాళులు : పుణేలో ఇటీవల హత్యకు గురైన సామాజిక కార్యకర్త, మూఢనమ్మకాల వ్యతిరేక ఉద్యమకారుడు నరేంద్ర దభోల్కర్‌కు రాజ్యసభ నివాళులు అర్పించింది. సభ సమావేశం కాగానే దభోల్కర్ హత్యను చైర్మన్ హమీద్ అన్సారీ ప్రస్తావిస్తూ విచారం వ్యక్తంచేశారు.
 
 సైబర్ డాటా భద్రతకు చర్యలు...
 ఇంటర్‌నెట్ వినియోగదారులపై పర్యవేక్షణ చేపట్టడంపై భారత ఆందోళనను అమెరికాకు తెలియజేసినట్టు ఐటీ మంత్రి కపిల్ సిబల్ రాజ్యసభకు తెలిపారు. అలాగే దేశంలో సైబర్ డాటా భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నట్లు ఆయన చెప్పారు.

>
మరిన్ని వార్తలు