నీచుల గురించి పట్టించు​కోకండి: ఆదిత్య ఠాక్రే

24 Dec, 2019 16:21 IST|Sakshi

ముంబై : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారానే ట్రోల్స్‌కు సమాధానం చెబుదామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే అన్నారు. ఉద్యోగాల రూపకల్పన, ఆర్థిక వ్యవస్థ పురోగమనంతో వారికి తగిన దీటుగా బదులిద్దామని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు వర్సిటీలోకి వెళ్లి విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడంపై స్పందించిన... ఉద్ధవ్‌ ఠాక్రే... పోలీసుల చర్యను జలియన్‌ వాలాబాగ్‌ ఊచకోతతో పోల్చారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యలను తప్పుబడుతూ హిరణ్మయి తివారీ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు హిరణ్మయిపై దాడి చేసి.. అతడికి శిరోముండనం చేశారు. ఈ మేరకు అతడు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో శివసేన కార్యకర్తల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ నేపథ్యంలో శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆదిత్య ఠాక్రే ట్విటర్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘మత సామరస్యాన్ని పెంపొందించేందుకు... సీఏఏపై మహారాష్ట్ర ప్రజలకు ఉన్న భయాన్ని పోగొట్టేందుకు... సీఎం చేసిన వ్యాఖ్యలను... చవకబారు వ్యక్తులు ట్రోల్‌ చేశారు. అటువంటి కిందిస్థాయి వ్యక్తుల పట్ల మీరు స్పందించిన తీరు నా దృష్టికి వచ్చింది. నిజానికి శాంతి భద్రతల విషయం పోలీసులకు సంబంధించింది. అయితే ఇటువంటి అసభ్యకర వ్యాఖ్యలు చేసే చెత్త మనుషులు, నీచులకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలు, చిన్నారులపై నీచపు కామెంట్లు చేసే ఇలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. వాళ్లను ప్రజాస్వామ్య వ్యవస్థ తిరస్కరిస్తుంది. సోషల్‌ మీడియాలో ద్వేషం వెళ్లగక్కుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎవరూ క్షమించరు. కాబట్టి మనం ప్రజల మనసు​ గెలవాలే తప్ప ట్రోల్స్‌ గురించి పట్టించుకోనవసరం లేదు. వారు దేశంలోని కొంతమంది బడా నాయకులను అనుసరిస్తున్నారు’ అని ఆదిత్య ఠాక్రే తన తండ్రిని విమర్శిస్తున్న వారికి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు