కాంగ్రెస్ ను ఊడ్చేసిన ఆప్

9 Dec, 2013 01:49 IST|Sakshi
కాంగ్రెస్ ను ఊడ్చేసిన ఆప్

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 ‘డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ మేన్’ అని చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ చెప్పిన డైలాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజయానికి అతికినట్టు సరిపోతుంది. సామాన్యుడికి అండగా ఉంటామంటూ వచ్చిన ఆప్‌కు సామాన్యులే అండగా నిలిచారు.  2012 నవంబర్‌లో పురుడు పోసుకున్న ఈ పార్టీ ఏడాది వ్యవధిలోనే కళ్లు చెదిరే ఫలితాలు సాధించింది. 15 ఏళ్ల షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించింది. పార్టీ గుర్తు అయిన చీపురునే ఆయుధంగా మార్చి కాంగ్రెస్‌ను ఢిల్లీ నుంచి ‘ఊడ్చేసింది’. సమాజంలోని అన్ని వర్గాల ఆదరణ పొందడమే దాని విజయానికి మూల కారణమని చెప్పాలి.
 
  అవినీతి వ్యతిరేకోద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆ పార్టీ సామాన్యుల సమస్యల పరిష్కారానికి పోరాడుతూ ప్రజలకు చేరువైంది. రోజువారీ జీవనంలో తామంతా ఏదో ఒక దశలో అనివార్యంగా ఎదుర్కొంటున్న అవినీతి భూతం అంతం ఆప్‌తో సాధ్యమని ఢిల్లీ మధ్యతరగతి ప్రజలు విశ్వసించారు. వారి ఆగ్రహాన్ని పాలక పక్షంపైకి మళ్లించడంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పూర్తిగా సఫలీకృతుడయ్యారు. విద్యుత్, నీటి చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన చేపట్టిన ఉద్యమంతో పార్టీ మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఢిల్లీలో విద్యుత్ సరఫరాను రిలయన్స్, టాటా సంస్థలకు అప్పగించడం తెలిసిందే. బిల్లు కట్టలేనివారి మీటర్లను అధికారులు తొలగిస్తే కేజ్రీవాల్ స్వయంగా ఎలక్ట్రీషియన్ అవతారమెత్తి మరీ వాటిని బిగించారు. వ్యవస్థలో ఉంటూనే దాని లోపాలపై పోరాడతానంటూ ఆకట్టుకున్నారు.
 
 సవాళ్లే పునాదిరాళ్లు
 జన లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక ఉద్యమాల సమయంలో.. ‘‘దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో మాట్లాడాలి’’ అంటూ పార్టీలన్నీ విసిరిన సవాళ్లను కేజ్రీవాల్ స్వీకరించారు. ఆప్‌ను స్థాపించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. మచ్చలేని వ్యక్తులు, సామాన్యులకే టికెట్లు ఇస్తామంటూ చేసిన ప్రకటనకు కట్టుబడ్డారు. వేరే పార్టీల నుంచి వచ్చిన ‘ఆయారాం.. గయారాం’లకు టికెట్లు నిరాకరించారు. విద్యావంతులను, సామాన్యులనే అభ్యర్థులుగా ఎంపిక చేయడం కూడా ప్రజాదరణకు కారణమైంది.
 
 వెంట నడిచిన యువత
 అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్‌తో పాటు ఉన్న యువత.. పార్టీ వెంట కూడా నడిచింది. యువ ఓటర్లలో అధిక శాతం ఓట్లు ఆప్ దక్కించుకుంది. యువత అండతో ప్రచారాన్ని కూడా వినూత్నంగా నిర్వహించి ఓటర్లను ఆకట్టుకుంది. వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వ్యాపారులు ఆప్‌కు మద్దతుగా విసృ్తతంగా ప్రచారం చేశారు. అంతెందుకు, ఢిల్లీ నట్టనడుమ ఆప్ ప్రధాన కార్యాలయమున్న భవనం కూడా ఎన్నారై అభిమాని ఒకరు నెలకు రూ.1 అద్దె లెక్కన అభిమానం కొద్దీ ఇచ్చిందే!
 
 ఆటోవాలాల అండ..
 ఆటోల మీద ఏర్పాటు చేసే వ్యాపార ప్రకటనల మీద స్థానిక సంస్థలు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆటోవాలాల పక్షాన ఆప్ ఉద్యమించింది. దాంతో పన్నును ఉపసంహరిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆటోవాలాలంతా ఆప్‌కు అండగా నిలిచారు. సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ ఘటనకు కేజ్రీవాల్, ఆయన బృందం తీవ్రంగా స్పందించింది. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైందంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలనూ తూర్పారబడుతూ ఉద్యమించారు. మహిళల ఆదరణ లభించడానికి ఈ పోరాటం ఎంతగానో దోహదం చేసింది. ఆప్‌కు జాతీయ, స్థానిక మీడియా అధిక ప్రాధాన్యమివ్వడం కూడా ఆప్‌కు కలిసొచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
 కాంగ్రెస్ ఓటుకు భారీ గండి
 ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే. ఆప్ అసలు పార్టీయే కాదు’’ అంటూ షీలా అవహేళన చేయడం అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది. కాంగ్రెస్‌ను మూడోస్థానంలోకి నెట్టడమే గాక షీలాను కూడా ఆప్ ఇంటి దారి పట్టించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో ఎక్కువ శాతాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకున్న మురికివాడ(జుగ్గీ జోపిడీ)ల్లోకి చొచ్చుకెళ్లింది.
 
 విజయానికి ఆరు మెట్లు
 అవినీతిపై పోరాడుతుందన్న ట్యాగ్, ప్రజల్లో సానుభూతి తదితరాలన్నీ ఉన్నా, వాటిని ఓట్ల రూపంలోకి మార్చడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి సహకరించిన ఆరంచెల వ్యూహాన్ని ఒకసారి పరిశీలిస్తే...
 1. అవగాహన కార్యక్రమం: దీన్ని మార్చిలో చేపట్టారు. ఇందులో భాగంగా మూడు వారాల్లోపే ఒక్క పాలెం ప్రాంతంలోనే 1,100 మందిని కొత్తగా ఓటర్లుగా చేర్చారు.
 
 2. గడప గడపకూ ప్రచారం: ఏప్రిల్ నుంచి రెండు నెలల పాటు చేపట్టారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లోనే ఏకంగా 72,000 నకిలీ ఓట్లను గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేశారు.
 
 3.  కాలింగ్: ఆప్‌ను మెరుగుపరిచేందుకు ఏం చేయాలో సలహాలు చెప్పాల్సిందిగా ప్రజలనే కోరారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వీలైనంత మందికి, విదేశాల్లోని భారతీయులకు ఒక మొబైల్ నంబర్ పంపారు. సలహాలు, సూచనలతో మే-నవంబర్ మధ్య ఏకంగా 5 లక్షల పై చిలుకు ఫోన్లు వచ్చాయి!
 
 4. మార్పు కోసం నాటకాల ప్రదర్శన: ఇది మరో ఆసక్తికర ప్రయోగం. పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు దేశభక్తి గేయాలు ఆలపించడం, ప్రజా సమస్యలు తదితరాలపై నాటకాలాడటం వంటివి ఓటర్లను బాగా ఆకర్షించాయి. వాటిలో భాగంగానే పార్టీ లక్ష్యాలను కూడా వివరించేవారు. ఇందులో కాలేజీ విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
 
 5. మెట్రో వేవ్: ప్రయాణికుల్లో అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ఆఫ్ కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమమిది. పార్టీ జెండా, టోపీలతో వారు మెట్రో ప్లాట్‌పారాలపై నడుస్తూ తమ లక్ష్యాల గురించి ప్రయాణికులకు వివరించేవారు.
 
 6. బూత్ మేనేజ్‌మెంట్: ఆప్ తన ప్రచారాన్ని పోలింగ్ బూత్‌ల వారీగా పక్కాగా నిర్వహించింది. ప్రచార సరళి గురించిన వివరాలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరవేసేవారు. అప్పుడప్పుడు కేజ్రీవాల్ స్వయంగా వారితో మాట్లాడి సలహాలు, సూచనలు ఇచ్చేవారు.

మరిన్ని వార్తలు