'మా సీఎం సరే.. మీ పీఎం దేశంలోనే ఉండరేం?'

9 Sep, 2016 19:01 IST|Sakshi
'మా సీఎం సరే.. మీ పీఎం దేశంలోనే ఉండరేం?'

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సభకు హాజరుకాకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన బీజేపీపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ముఖ్యమంత్రి సంగతి సరే ప్రధాని నరేంద్రమోదీ సంగతేమిటి.. ఆయన చాలా అరుదుగా దేశంలో కనిపిస్తున్నారు కదా అంటూ నిలదీశారు. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. అయితే, ఇందులో ముగ్గురే కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. మిగితావారెవ్వరూ కూడా సభలో కనిపించలేదు. దీంతో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు విజేంద్ర గుప్తా మాట్లాడుతూ 'ప్రత్యేక సమావేశం అంటూ పిలిచారు.

కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కనిపించడం లేదు. కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు మాత్రమే హాజరయ్యారు. మిగితా వారెవ్వరూ లేరు' అని అంటుండగానే ఆయన మైకును కట్ చేశారు. పంజాబ్ భారత దేశంలో భాగం కాదని మీరు అనుకుంటున్నారా అంటూ స్పీకర్ ప్రశ్నించారు. వెంటనే సీట్లో కూర్చొండని ఆదేశించారు. అయితే మాట్లాడుతుంటే మైకు కట్ చేయడం ప్రజాస్వామ్యం అంటారా అని గుప్తా ప్రశ్నించారు. దీంతో ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి విషయం అట్లుంచితే.. ప్రధాని నరేంద్రమోదీ చాలా అరుదుగా దేశంలో కనిపిస్తున్నారుగా.. ఆయన సంగతేమిటి? ఆయన ఎందుకు దేశంలో కలియతిరగరు' అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు