గంభీర్‌.. ‘ఐయామ్‌ ఢిల్లీ’ ట్వీట్‌పై ఆప్‌ నేతల సవాల్‌

21 Jan, 2019 17:54 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘ఐయామ్‌ ఢిల్లీ’  అంటూ ఢిల్లీ ప్రజల పరిస్థితిని వివరిస్తూ, రాజకీయ పార్టీల తీరును విమర్శిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ చేసిన ట్వీట్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు స్పందించారు. దేశ రాజధానిలో ఆస్పత్రులు,  నైట్‌ షెల్టర్ల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూడాలంటూ గంభీర్‌కు సవాలు విసురుతున్నారు. ఆప్‌, కాంగ్రెస్‌, బీజేపీ తీరును విమర్శిస్తూ... ‘ నేను ఢిల్లీని.. ఫుట్‌పాత్‌పై వణకడమే నాకు తెలుసు. నేను ఢిల్లీని.. ఆస్పత్రుల్లో చికిత్స కోసం పాకులాడుతాను. నేను ఢిల్లీని.. వ్యవస్థతో పోరాడతాను. నేను ఢిల్లీని... కాలుష్యపు గాలిని పీలుస్తాను. నేను ఢిల్లీని నా నగ్నత్వాన్ని మఫ్లర్‌, కాషాయం, ఖాదీల వెనుక దాచుకుంటాను’ అంటూ గంభీర్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో గంభీర్‌ ట్వీట్‌పై స్పందించిన ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌... ‘ గంభీర్‌ జీ మా సవాలు స్వీకరించండి. నైట్‌ షెల్టర్ల, ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టండి. బీజేపీ ప్రభుత్వం మీకు ఇలాంటి సవాలు విసరలేదు’ అని కామెంట్‌ చేయగా...‘ మీ ట్వీట్‌ హృదయాన్ని తాకే విధంగా ఉంది. అయితే ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్‌లను ఒక్కసారి సందర్శించండి. ఆ తర్వాత వాటి పరిస్థితి గురించి ఫేస్‌బుక్‌, ట్విటర్లలో లైవ్‌ టెలికాస్ట్ చేయండి’ అంటూ ఆప్‌ సోషల్‌ మీడియా వింగ్‌ అధికారి అంకిత్‌లాల్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ గతేడాది డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. సామాజిక అంశాలపై తరచుగా స్పందించే గంభీర్‌ రాజకీయాల్లోకి వస్తాడంటూ గత కొంత కాలంగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

మరిన్ని వార్తలు