ఆప్ ఎన్నికల ఖర్చు రూ. 20 కోట్లే

11 Feb, 2015 17:42 IST|Sakshi
ఆప్ ఎన్నికల ఖర్చు రూ. 20 కోట్లే

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ సాధించిన అఖండ విజయం ఎన్నికల రణరంగంపై అనాదిగా మనలో వేళ్లూనుకుపోయిన ఎన్నో ఆపోహలను ఒక్కసారిగా పటాపంచలు చేసిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కాని నిజం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో జరిగే ఏ ఎన్నికల్లోనైనా  కొత్త  పార్టీ నెగ్గుకు రావాలంటే ఆషామాషీ కాదని, అందుకు మందీ మార్బలంతోపాటు కావాల్సినంత డబ్బు ఉండాలన్నది సార్వజనీక సత్యంగా చెబుతుంటారు రాజకీయ పండితులు. కానీ ప్రజల పక్షాన పనిచేయాలనే పట్టుదల, అంకిత భావం ఉన్న గుప్పెడు మనుషులుంటే చాలు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు తీసుకరావచ్చని నిరూపించారు కేజ్రీవాల్ బృందం. ఆ బృందం ఆవిష్కరించిన సరికొత్త అధ్యాయంలో పరిగణలోని తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యాంశాలు....
 

  •  సమున్నత ఆశయం...దాన్ని అమలు చేయడానికి సరైన వ్యూహం,  చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష ఉంటే ఓ చిన్న బృందం కూడా ప్రపంచాన్నే మార్చేయవచ్చు
  •  ఎన్నికల్లో పోటీ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నదన్న మాట ఇక నిన్నటిది.అంతగా ఆర్థిక బలం లేనివారు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే కొత్త బాటకు దారి చూపింది ఆప్ విజయం.
  •  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టింది కేవలం 20 కోట్ల రూపాయలలోపే అంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే బీజేపీ ఒక్క  ప్రింట్ మీడియాలోనే ప్రచారానికి 20 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్టు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఒక్క పోలింగ్ రోజునే ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట.
  •  ఈ 20 కోట్ల రూపాయలను సమీకరించడానికి కూడా ఆప్ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఆన్‌లైన్ విరాళాలు తీసుకోవడంతోపాటు కేజ్రీవాల్ విందు సమావేశాల ద్వారా విరాళాలు వసూలు చేశారు. తనతో విందారగించాలంటే 20 వేల రూయాలు విరాళాలు ఇవ్వాలంటూ ముందుకెళ్లారు.
  •  ఎన్నికల వ్యయాన్ని తగ్గించడం కోసం ఆప్ భారీ బహిరంగ సభలకు, మోటారు వాహనాల ర్యాలీలకు స్వస్తి చెప్పి వీధి సభలను ఏర్పాటు చేసింది. ఇలా ఏర్పాటు చేసిన 700 జన సభలకు సరాసరిన 10వేల చొప్పున 70 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.
  •  ఆప్‌కు ఢిల్లీలో కార్యకర్తల బలం లేకపోయినా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగితూ ప్రచారం చేశారు. వారితో పాటు కేజ్రీవాల్ కూడా కలియతిరుగుతూ ఎన్నికలన్ని రోజులు ప్రజల మధ్యనే గడిపారు.
  •  ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని ఎలా పరిష్కరిస్తామో సూచిస్తూ మీడియాను కూడా ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో మీడియా కూడా ప్రజాగళంకాక తప్పలేదు.
     

మరిన్ని వార్తలు