'వదంతుల వల్ల నా భర్త నన్ను వదిలివేశారు'

5 May, 2015 03:35 IST|Sakshi
కుమార్ విశ్వాస్‌

 న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. ఆ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్‌పై ఆప్ మహిళా కార్యకర్త ఆరోపణలు చేశారు. తనకు ఆయనతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు వస్తున్న వదంతులను విశ్వాస్ ఖండించటం లేదని, దీనివల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని ఆమె ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యు)కు ఫిర్యాదు చేశారు. దీంతో తమ ముందు హాజరు కావలసిందిగా డీసీడబ్ల్యు కుమార్ విశ్వాస్‌కు, ఆయన భార్యకు నోటీసులు పంపించింది. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు వేర్వేరుగా లేఖలు రాసినప్పటికీ, స్పందన లేదని అందువల్లే మహిళా కమిషన్‌ను ఆశ్రయించానని ఆమె తెలిపారు.

2014 ఎన్నికల్లో కుమార్ విశ్వాస్ తరపున అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. రకరకాల పుకార్లు పుట్టించటం ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారాలనీ, ఆప్‌ను అప్రతిష్టపాల్జేయటం కోసం ప్రత్యర్థి పార్టీలు పుట్టిస్తున్న కథనాలని విశ్వాస్ సోమవారం ఖండించారు. 'కొన్నాళ్ల క్రితం సదరు మహిళ, బీజేపీ ప్రతినిధి సహా కొందరు వ్యక్తులు తనపై అబద్ధాలు పుట్టిస్తున్నారని, తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో బీజేపీ ప్రతినిధి పేరు కూడా ప్రస్తావించారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదు. అప్పుడు నాకు ఆమె కుమార్ భయ్యా ఏం చేయాలో చెప్పండంటూ మెయిల్ పంపించారు. అప్పుడు ఆప్ న్యాయ విభాగం ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఆమెకు సూచించింది' అని అన్నారు. డీసీడబ్ల్యు నోటీసులు అందిన తరువాత తగిన విధంగా స్పందిస్తానని ఆయన అన్నారు.

తనపై వస్తున్న పుకార్లను ఖండించకపోవటంపై మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 'కేవలం ఈ వదంతుల వల్ల నా భర్త నన్ను వదిలేశాడు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. కుమార్ విశ్వాస్ ఆప్‌లో అందరికీ తెలిసిన నాయకుడు కాబట్టి ఇద్దరి మధ్య ఏదైనా ఉండవచ్చని భావించవచ్చు. అందుకే ఆయన వివరణ ఇవ్వాలని కోరుతున్నా. కానీ, ఆయన మాత్రం మాట్లాడటం లేదు'అని ఆందోళన చెందారు. డీసీడబ్ల్యు చైర్‌పర్సన్ బర్ఖాసింగ్ మాట్లాడుతూ 'ఆప్‌కు చెందిన ఈ పార్టీ కార్యకర్త కొద్ది రోజులుగా మా దగ్గరకు వస్తున్నారు. తమ సొంత పార్టీ కార్యకర్త వచ్చి ఆరోపిస్తున్నప్పుడు ఆయనకు(విశ్వాస్) వచ్చి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ వందంతుల ఆరోపణల వల్ల ఆమె వివాహ బంధం దెబ్బతినే అవకాశాలున్నాయి'అని అన్నారు.

ఇదిలా ఉండగా, మహిళా కార్యకర్త ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ రాసినట్లు ఉత్తర ఢిల్లీలోని నందగిరి పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. ఐపీసీ 509 సెక్షన్, ఐటీ యాక్ట్ సెక్షన్ 67ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటికే ఢిల్లీ న్యాయశాఖ మంత్రి తోమర్ నకిలీ న్యాయవాద డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉన్నారన్న ఆరోపణల వివాదం నుంచే ఆప్ బయటపడలేదు. అంతకు ముందు ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య, అంతలోనే కుమార్ విశ్వాస్ ఉదంతం.. ఇలా వరుస వివాదాలు ఆప్‌ను సతమతం చేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు