‘కేజ్రీవాల్‌ రూ.27లక్షల అద్దె కట్టి వెంటనే ఖాళీ చేయ్‌’

15 Jun, 2017 12:07 IST|Sakshi
‘కేజ్రీవాల్‌ రూ.27లక్షల అద్దెకట్టి వెంటనే ఖాళీ చేయ్‌’

న్యూఢిల్లీ: సొంత ప్రభుత్వం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీకి కష్టమొచ్చిపడింది. ప్రభుత్వ భవనాన్ని అక్రమంగా అక్రమించుకొని అందులో పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ వెంటనే రూ.27లక్షలు అద్దె చెల్లించాలంటూ స్థానిక ప్రభుత్వ సంస్థ నోటీసులు పంపించింది. ఈ అద్దె అసలు లైసెన్స్‌ ఫీజుకంటే 65 రెట్లు అదనం అని కూడా తెలిపింది. ఈ అద్దె చెల్లించడం ఆలస్యం అయితే ప్రతి నెలా మరింత ఎక్కువవుతుందని కూడా స్పష్టం చేసింది. ఉత్తర ఢిల్లీలోని రోజ్‌ అవెన్యూలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తన పార్టీ కార్యాలయం నడుతోంది. అయితే, ఈ భవనం పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ది.

ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందించకుండానే చట్ట విరుద్ధంగా ఆ భవనాన్ని ఆక్రమించుకోవడంతోపాటు అద్దె కూడా చెల్లించడం లేదని పీడబ్ల్యూడీ అధికారులు రూ.27,73,802 అద్దె చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. గత ఏప్రిల్‌లోనే ప్రభుత్వ సంస్థ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు నోటీసులు పంపించింది. పార్టీ కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయాలని అందులో ఆదేశించింది. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఈ భవనాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు