అదనపు ఫీజు తిరిగి చెల్లించాల్సిందే..

24 May, 2018 16:05 IST|Sakshi

ప్రైవేట్‌ పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ : అదనపు ఫీజులతో సతమతమవుతున్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం ఊరట కల్పించింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి వసూలు చేసిన అదనపు ఫీజును తిరిగి ఇచ్చేయాలంటూ ప్రైవేటు స్కూళ్లను ఢిల్లీ సర్కారు ఆదేశించింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (డీవోఈ) నియమించిన కమిటీ అందించిన నివేదిక సూచనలను అనుసరించి... జూన్‌ 2016 నుంచి జనవరి 2018 వరకు అదనంగా వసూలు చేసిన ఫీజుపై 9 శాతం వడ్డీ కూడా చెల్లించే విధంగా నిబంధనలు రూపొందించింది. ఈ మొత్తాన్ని వారం రోజుల్లోగా తిరిగి చెల్లించాలంటూ స్కూళ్లను ఆదేశించింది.

ఈమేరకు 6వ చెల్లింపు కమిషన్‌ సిఫారసులు అమలు చేయాల్సిందిగా ఢిల్లీలోని 575 పాఠశాలలకు నోటీసులు జారీచేసింది. అలా చేయని పక్షంలో ఢిల్లీ విద్యా చట్టం- 1973 ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని డీవోఈ హెచ్చరించింది. డీవోఈ నివేదికలో పేర్కొన్నట్లుగా అదనపు ఫీజు వసూలు చేసిన స్కూళ్ల వివరాలు 15 రోజుల్లోగా అందజేయాల్సిందిగా ఆయా జిల్లాల డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్లను ఆదేశించింది.

గతేడాది 449 పాఠశాలలకు..
అదనపు ఫీజులు వసూలు చేసిన 449 పాఠశాలలకు గతేడాది కూడా ఢిల్లీ సర్కారు షోకాజ్‌ నోటీసులు పంపింది. తల్లిదండ్రులను పిలిపించి రెండు వారాల్లోగా ఫీజు చెల్లించాలంటూ ప్రభుత్వం షరతులు విధించడంతో.. కొన్ని పాఠశాలలు వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా డబ్బులు వాపసు తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులను కోరాయి. అయితే అలా చెల్లించని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలనే యోచనలో ఉన్నప్పటికీ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయా స్కూళ్లను ప్రభుత్వమే టేకోవర్‌ చేయాలనుకుంటుందని విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోడియా సలహాదారు అతీషి మర్లేనా తెలిపారు.

మరిన్ని వార్తలు