5 రోజులు ఆస్పత్రిలోనే.. కేంద్రం నిర్ణయంపై ఆప్‌ ఆగ్రహం

20 Jun, 2020 15:56 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా సోకిన వారిని హోం క్వారంటైన్‌కు తరలించే ముందు ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌ వార్డులోనే ఉంచాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజ‌ల్ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ఆప్‌ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. గవర్నర్‌ ఆదేశాన్ని ఆచరణలో పెట్టాలంటే జూన్‌ 30 నాటికి మరో 90 వేల బెడ్లు అవసరమవుతాయని.. ప్రస్తుతం అన్ని పడకలు సిద్ధంగా లేవని ఆప్‌ నాయకుడు రాఘవ్‌ చాధా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నివేదిక ప్రకారం జూన్‌ 30నాటికి ఢిల్లీలో 15 వేల బెడ్లు అవసరమవుతాయి. అలాంటిది గవర్నర్‌ ఉత్తర్వులను అమలు చేస్తే.. ఈ నెల చివరకు 90 వేల బెడ్లు కావాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకురావాలి’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే క్వారంటైన్‌ కేంద్రాలకు పంపుతారనే భయంతో ప్రజలు స్వతహాగా కరోనా పరీక్షలు కూడా చేయించుకోవడం లేదని అన్నారు. కేంద్రం నిర్ణయం ఏకపక్షంగా ఉందని రాఘవ్‌ చాధా విమర్శించారు. (క‌రోనా: ఇక‌పై 5 రోజుల‌పాటు ఆస్పత్రిలోనే)
 

ప్ర‌స్తుతం దేశ రాజ‌ధానిలో 8,400 క‌రోనా బాధితులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఎన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్యలు తీసుకుంటున్నా క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఇటీవ‌లే ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్‌కు కోవిడ్ నిర్ధార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక దేశ వ్యాప్తంగా 24 గంట‌ల్లోనే 14,516 కొత్త క‌రోనా కేసులు నమోదుకాగా, 375 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,95,048కి చేరిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. (ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది)

మరిన్ని వార్తలు