ఆప్ లో 'దుష్ట చతుష్టయం'

6 Jun, 2014 13:07 IST|Sakshi
ఆప్ లో 'దుష్ట చతుష్టయం'
సాప్, యాప్, మాప్, పాప్ పార్టీల పేర్లెప్పుడైనా విన్నారా? సాప్ అంటే సంజయ్ ఆద్మీ పార్టీ. యాప్ అంటే యోగేంద్ర ఆప్ పార్టీ. మ్యాప్ అంటే మనీష్ ఆద్మీ పార్టీ, పాప్ అంటే పర్వీన్ అమానుల్లా పార్టీ. ఇవన్నీ నిజంగా పార్టీలు కాదండోయ్. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి గుప్పెట్లో ఉందని చెప్పేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ రెబెల్స్ ఈ పేర్లు పెట్టారు. ఉత్తరప్రదేశ్ లో సాప్, హర్యానాలో యాప్, మధ్యప్రదేశ్ లో మ్యాప్, బీహార్ లో పాప్ గా మారిపోయిందని, ఆ నేత ఇష్టారాజ్యమే నడుస్తోందని రెబెల్స్ ఆరోపిస్తున్నారు. 
 
ఇప్పుడు దేశవ్యాప్త ఆమ్ ఆద్మీ రెబెల్స్ జోనల్ స్థాయిలో సభలు పెట్టి ఆప్ ఆపసోపాలు పడేలా చేయబోతున్నారు. మొదటి సభ బెంగుళూరులో జరగబోతోంది. ఇందులో ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే షాజియా ఇల్మీ, మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అశ్వినీ ఉపాధ్యాయ్, పార్టీ వ్యవస్థాపక సభ్యులు మధు భండారిలు పాల్గొంటారు. వీరంతా ఆప్ లో ఒక దుష్ట చతుష్టయం రాజ్యమేలుతోందని, పార్టీలో ప్రజాస్వామ్యం లేదని అంటున్నారు. దుష్టచతుష్టయం అంటే అరవింద కేజరీవాల్, యోగేంద్ర యాదవ్, మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్ లేనని వారంటున్నారు. 
 
ఇప్పుడీ తిరుగుబాటుదారులు టీఎన్ శేషన్, యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ లేదా ఎన్ సి ఈ ఆర్ టీ మాజా డైరెక్టర్ జెఎస్ రాజ్ పుత్ లలో ఎవరో ఒకరిని తమఅధినేతగా ఎన్నుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద 'చీపురుకట్టలు' తిరగబడుతున్నాయి.
మరిన్ని వార్తలు