‘ఆప్‌’ రాజస్థాన్‌ ఇంచార్జ్‌ తొలగింపు

11 Apr, 2018 20:33 IST|Sakshi
కుమార్‌ విశ్వాస్‌

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తోన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌ ఆప్‌ ఇంచార్జ్‌గా ఉన్న కుమార్‌ విశ్వాస్‌ను ఆ పదవి నుంచి తప్పించింది. ఈ విషయాన్ని ఆప్‌ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్‌ వెల్లడించారు. విశ్వాస్‌ స్థానంలో దీపక్‌ బాజ్‌పాయిని ఇంచార్జ్‌గా నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. విశ్వాస్‌కు తీరిక లేనందువల్లే ఆయనను ఈ బాధ్యతల నుంచి తప్పించినట్టు అశుతోష్‌ తెలిపారు.

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను దీపక్‌కు అప్పగించామని, జాబితాపై తుది నిర్ణయం మాత్రం పొలిటికల్‌ కమిటీ తీసుకుంటుదని ఆయన పేర్కొన్నారు. అయితే విశ్వాస్‌కు, పార్టీ సీనియర్‌ నేతలకు మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్లే ఆయనను పదవి నుంచి తొలగించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌.. పంజాబ్‌ మంత్రికి క్షమాపణలు చెప్పడంపై విశ్వాస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు