కేజ్రీవాల్‌ ఖాతాలో మరో ‘విజయం’!

13 Feb, 2020 13:37 IST|Sakshi

న్యూఢిల్లీ : ముచ్చటగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది  కేవలం 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా పది లక్షల మంది(1 మిలియన్‌) ఆ పార్టీలో భాగస్వామ్యం అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు ఆమ్‌ ఆద్మీ తమ పార్టీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని సూచించింది. దీంతో అనూహ్యంగా ఒక్క రోజులోనే దాదాపు 11 లక్షల మంది ఈ క్యాంపెయిన్‌లో భాగస్వాములు అయ్యారు. దీనిపై పార్టీ స్పందిస్తూ.. ‘ఒక్క రోజులోనే 11 లక్షల మంది పార్టీలో చేరారు. ఇది భారీ విజయం’ అంటూ ట్వీట్‌ చేసింది. మరోవైపు ప్రజల నుంచి ఇంత భారీ ఎత్తున స్పందన లభించడం చరిత్రాత్మకమని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. (కేజ్రీవాల్‌ కేబినెట్‌: వారిద్దరికి ఛాన్స్‌ లేనట్లే!)

ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు గానూ 62 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించగా.. బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ అసలు ఖాతా కూడా తెరవలేదు. ఈ క్రమంలో వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని కేజ్రీవాలే చేజిక్కించుకున్నారు. ఆయన ఈనెల 16న ఢిల్లీలోని రామలీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. (16న కేజ్రీవాల్‌ ప్రమాణం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు