‘చంద్రమండలంపై ఉద్యోగాలిస్తామంటారేమో’

26 Jan, 2017 21:34 IST|Sakshi
‘చంద్రమండలంపై ఉద్యోగాలిస్తామంటారేమో’

చండీగఢ్‌: పంజాబ్‌ శిరోమణి అకాళీదల్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ విరుచుకుపడింది. ఆ పార్టీ మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని ప్రజలను హెచ్చరించింది. తమకు మరోసారి అధికారం ఇస్తే అమెరికా, కెనడాల్లో ఉన్న పంజాబీలకు, అక్కడికి వెళ్లి స్థిరపడాలనుకునేవారికి అక్కడే పొలాలు కొని ఇస్తామంటూ ఉప ముఖ్యమంత్రి సుఖబీర్‌ సింగ్‌ బాదల్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం జలాలాబాద్‌లో నిర్వహించిన సభలో ఆప్‌ ప్రచారక కమిటీ చైర్మెన్‌ భగవత్‌ మాన్‌..

‘సుఖబీర్‌ ఈసారి అమెరికా ప్రభుత్వ సహకారంతో నిరుద్యోగ యువతకు చంద్ర మండలంపై ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. తన అవినీతి సొమ్ముతో వలసదారుల పేరు మీద అమెరికా, కెనడాల్లో వ్యవసాయ భూములు ఆయన కొంటారు కూడా. ఇలాంటి అర్థంలేని హామీలను పంజాబ్‌ ప్రజలు నమ్మరు’  అన్నారు. పేదలు, ఎన్నారైల భూములు లాక్కున్నవారు (పంజాబ్‌ ప్రభుత్వం) తిరిగి వలసదారులకు సహాయం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సుఖబీర్‌ గురించి తెలిసిన వారందరికీ ఆయన ప్రజలను మోసం చేస్తున్నారని అర్థమవుతుందన్నారు. బాదల్‌ కుటుంబం విదేశాల్లో పెద్ద మొత్తంలో భూములు కొన్నట్లు ఆయన ఆరోపించారు.

మరిన్ని వార్తలు