ఫోటో వైరల్‌.. కేజ్రీవాల్‌పై నెటిజనుల ప్రశంసలు

29 May, 2020 14:25 IST|Sakshi

న్యూఢిల్లీ: 2018 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియా కూడా కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత లాక్‌డౌన్‌ కాలంలో కూడా పార్టీలన్ని సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గురువారం ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఏఏపీ) సోషల్‌ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో క్వారంటైన్‌ కేంద్రాల్లో భోజనం సరిగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) పార్టీ జాతీయ ప్రతినిధి మంజిందర్ ఎస్ సిర్సా ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు పెడుతున్న భోజనానికి సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ట్యాగ్‌ చేస్తూ ‘కరోనా పేషెంట్లు ఇలాంటి భోజనం తింటే.. వారికి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది’ అని ట్వీట్‌ చేశారు సిర్సా.(‘40 రోటీలు, 10 ప్లేట్ల భోజనం.. మా వల్ల కాదు’)

దీనిపై స్పందిస్తూ ఆప్‌ కింది ఫోటోలను ట్వీట్‌ చేసింది. ‘ఢిల్లీ గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం కరోనా పేషంట్లకు అందిస్తున్న భోజనం.. కేంద్రం ప్రభుత్వం నడుపుతున్న ఆస్పత్రుల్లో రోగులకు పెడుతున్న ఆహారం’ అంటూ ఓ ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం కరోనా పేషెంట్లకు భోజనంలో ఎండిపోయిన చపాతీలను అందించగా.. కేజ్రీవాల్‌ గవర్నమెంట్‌ మాత్రం అన్నం, కూర, ఫ్రై, చారుతో పాటు కీర, క్యారెట్‌, గుడ్డు కూడా అందిస్తుంది. అంతేకాక సిర్సా చెబుతున్న ప్రభుత్వ ఆస్పత్రిని కేంద్రం ప్రభుత్వం నడుపుతున్నట్లు ఆప్‌ వెల్లడించింది. ఢిల్లీ ప్రభుత్వం కిందకు వచ్చే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చాలా మంచి భోజనం అందిస్తున్నామని ఆప్‌ పేర్కొంది. ఇది చూసిన జనాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు.. కేజ్రీవాల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు