మీ తమ్ముడిగా నాదో చిన్న సలహా..: కేజ్రీవాల్

13 Jun, 2016 20:20 IST|Sakshi
మీ తమ్ముడిగా నాదో చిన్న సలహా..: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించినా ఆయనేమీ మిమ్మల్ని దేశానికి ఉప రాష్ట్రపతిని చేయరు’ అంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలకు దిగారు. ఈ మేరకు ఎల్జీ జంగ్‌కు సోమవారం సీఎం లేఖ రాశారు. తమ ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), సీబీఐ వంటి సంస్థలతో విచారణలు చేయిస్తూ తమను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారంటూ మోదీ, జంగ్‌లపై కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు. తమ సర్కారు ఆదివారం ప్రారంభించిన బాబా సాహెబ్ అంబేడ్కర్ మెడికల్ కాలేజీపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఏసీబీతో దర్యాప్తు చేయించాలని ఎల్జీకి సీఎం సూచించారు.

అలాగే ప్రధాని మోదీకి చెప్పి రికార్డు సమయంలో కళాశాల నిర్మాణం పూర్తి చేసినందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌పై కూడా విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. మీ తమ్ముడిగా నాదో చిన్న సలహా.. ప్రధాని మోదీ సూచనల మేరకు మీరు రాజ్యాంగ వ్యతిరేక, అక్రమ, ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారు. అయితే ప్రధాని మాత్రం మిమ్మల్ని ఉప రాష్ట్రపతిని చేయబోరని మాత్రం గుర్తు పెట్టుకోండి’ అంటూ ఎల్జీని ఉద్దేశించి సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తాను, తన బృందం ప్రజల కోసం కష్టపడుతున్నామని సీఎం పేర్కొన్నారు. అయితే తాము చేసే ప్రతి మంచి పనికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎల్జీపై మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు