‘ఆరోగ్య సేతు’ తప్పనిసరి

29 Apr, 2020 17:09 IST|Sakshi

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య సేతు యాప్‌’ను  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరు తమ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదుల శాఖ బుధవారం నాడు పిలుపునిచ్చింది. ఆరోగ్య సేతు అనేది ‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొబైల్‌ అప్లికేషన్‌’. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వ్యక్తి ఎవరినయితే కలుసుకోబోతున్నారో, వారికి కరోనా వైరస్‌ సోకిందా, లేదా అన్న విషయాన్ని ముందుగానే హెచ్చరించి చెబుతుంది. (చదవండి : మీడియా మిత్రులకు కేజ్రీవాల్‌ ‘గుడ్‌న్యూస్‌’)

అందుకని ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ఆఫీసుకు బయల్దేరే ముందు తన ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను యాప్‌లో స్టోర్‌ చేయాలి. ఆఫీసుకు వెళ్లే ముందు ‘సేఫ్, లో రిస్క్‌’ అని సందేశం వచ్చినప్పుడు మాత్రమే ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. 

ఒకవేళ బ్లూటూత్‌ సామీప్యత ఆధారంగా యాప్‌లో ‘మోడరేట్’ లేదా ‘హై రిస్క్‌’ అని స్టేటస్‌ చూపెడితే ఆఫీస్‌కు రానవసరం లేదని కేంద్రం తెలిపింది. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండటం కానీ, యాప్‌లో స్టేటస్‌ లో రిస్క్‌ లేదా సేఫ్‌ అని చూపెట్టేవరకు ఇంటివద్దే ఉండాలని సూచించింది. కేంద్ర మంత్రిత్వశాఖల్లో, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ ఆదేశాలు తప్పకుండా అమలయ్యే చూడాలని జాయింట్‌ సెక్రటరీలకు ఆదేశాలు చేసింది.

మరిన్ని వార్తలు