కార్గిల్‌ వార్‌లో పాక్‌కి చిక్కిన పైలట్‌.. తర్వాత?

27 Feb, 2019 20:22 IST|Sakshi

పాకిస్తాన్‌కు చిక్కిన పైలట్‌ విక్రమ్ అభినందన్‌ పరిస్థితి ఏంటి ? ఇప్పుడు ప్రతీ భారతీయుడు మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇలాంటి సంఘటనే సరిగ్గా 20 ఏళ్ల కిందట ఎదురైంది.1999లో కార్గిల్ యుద్ధ సమయంలో సరిహద్దు గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్‌ 27 యుద్ధ విమానం గస్తీ కాసింది. ఆ యుద్ధ విమానంకు పైలట్‌గా వ్యవహరించారు లెఫ్టినెంట్‌ కే నచికేత. కానీ, కొన్ని సాంకేతిక లోపాలతో ఆ యుద్ధ విమానం పాక్ సరిహద్దుల్లో కూలిపోయింది. ప్యారచూట్‌తో దిగిన నచికేతను పాక్‌ ఆర్మీ యుద్ధ ఖైదీగా పట్టుకుంది. ఆ తర్వాత భారత ఆర్మీ రహస్యాలు చెప్పమని పాక్‌ సైనికులు నచికేతను చిత్ర హింసలకు గురిచేశారు. పాక్ ఉన్నతాధికారి ఒకరు చిత్రహింసలను ఆపివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే సైన్యం నచికేతపై దాడులు ఆపింది. అసలు మరుసటి రోజు చూస్తానో లేదో అన్నట్లుగా వారు హింసించారని నచికేత చెప్పారు. అయితే పాక్ ఉన్నతాధికారి యుద్ధ ఖైదీని విచారణ చేసే పద్ధతి ఇదికాదని చెప్పడంతో వారంతా వెనక్కు తగ్గారని వెల్లడించారు. నాడు భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం నుంచి పాక్ పై త్రీవ ఒత్తిడి రావడంతో ఎనిమిది రోజుల తర్వాత నచికేతను పాక్‌ వదిలిపెట్టింది. నాడు యుద్దం జరుగుతున్న సమయంలో తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించడం, ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా భారత రహస్యాలు చెప్పకపోవడంతో అప్పటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌, ప్రధాని వాజ్‌పేయిలు అతన్ని హీరోగా కొనియాడారు. నాటి ప్రభుత్వం ఆయన్ను వాయుసేన పథకంతో గౌరవించింది.

నచికేతను విడిపించేందుకు ఇస్లామాబాద్‌లో భారత హై కమిషనర్‌గా ఉన్న పార్థసారథి ఎంతగానో కృషి చేశారు. ఆ సమయంలో విదేశీవ్యవహారాల కార్యాలయంలో నచికేతన్‌ను ఉంచుతామని, తీసుకెళ్లాల్సిందిగా తనకు ఓ ఫోన్‌కాల్ వచ్చిందని పార్థసారథి చెప్పారు. నచికేతను దయ తలచి వదిలేస్తున్నామంటూ పాక్ చెప్పడాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని అందుకే తాను అక్కడికి రానని తేల్చి చెప్పినట్లు పార్థసారథి వివరించారు. జెనీవా కన్వెషన్ ప్రకారం పాకిస్తాన్ భారత అధికారులకు అప్పగించాల్సి ఉందని చెప్పారు. యుద్ధ సమయంలో దేశాలు ఎలా వ్యవహరించాలో అంతర్జాతీయ న్యాయసూత్రాలు జెనీవా కన్వెన్షన్‌లో పొందుపర్చారు. ఇక నచికేతను అదే రోజు సాయంత్రం జెనీవా కన్వెన్షన్ ప్రకారం పాక్ అధికారులు తనకు అప్పగించారని గుర్తుచేసుకున్నారు. అక్కడి నుంచి తాము వాఘా సరిహద్దు గుండా భారత్‌కు చేరుకున్నట్లు వెల్లడించారు. 

అయితే భారత యుద్ధ విమానం మిగ్‌-21 తమ భూభాగంలో కూలినప్పుడు ప్యారచూట్‌ సహాయంతో కిందకు దూకిన అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పాక్‌ వెల్లడించింది. అభినందన్‌ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును వెల్లడించలేదు. ప్రస్తుతం తమ కస్టడీలోనే ఉన్నట్లు చెబుతున్న పాక్, జెనీవా కన్వెన్షన్ ప్రకారం  అభినవ్‌ను వదిలేస్తుందా? భారత్ ఎలాంటి వ్యూహంతో అదృశ్యమైన పైలట్‌ను తిరిగి తీసుకొస్తుందో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచిచూడాల్సిందే.

మరిన్ని వార్తలు