దేశం మీసం మెలేస్తోంది

1 Mar, 2019 03:16 IST|Sakshi

పాక్‌ చిత్రహింసలతో నిబ్బరం కోల్పోని సాహసి

కీలక రహస్య డాక్యుమెంట్లు శత్రువు చేతికి చిక్కకుండా నమిలి మింగేశారు

గురి తప్పకుండా శత్రు విమానం కూల్చివేత

శభాష్‌ అభినందన్‌ అంటున్న సోషల్‌ మీడియా

మిగ్‌–21 వీరుడిపై యావద్భారతం ప్రశంసల వర్షం

దేశమంతా ఇప్పుడు ఒకటే నినాదం. భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ధైర్యసాహసాలను భారతం ముక్తకంఠంతో అభినందిస్తోంది. పాకిస్తాన్‌ విమానాలను తిప్పికొడుతూ.. ఆ ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్‌–21 బైసన్‌ విమాన పైలట్‌గా ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పాక్‌ సైన్యం ఎన్ని చిత్రహింసలు పెట్టినా బాధను పంటిబిగువన దిగమింగుతూ ప్రశాంత చిత్తంతో కనిపించిన వీరుడు.. విక్రమ్‌ అభినందన్‌ చూపించిన తెగువ, సాహసానికి యావద్భారతం సెల్యూట్‌ చేస్తోంది.

మిగ్‌–21 బైసన్‌ యుద్ధ విమానం కూలిన తర్వాత పాక్‌ సైనికులకు అభినందన్‌ చిక్కడం.. ఆ తర్వాత స్థానికులు ఆయన్ను రక్తం కారేలా హింసించినా.. వీరుడి ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. పాక్‌ సైన్యం కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనక్కి విరిచికట్టినా ముఖంపై చిరునవ్వు కోల్పోలేదు. కులాసాగా టీ తాగుతూ తనను పాక్‌ ఆర్మీ బాగానే చూసుకుంటోందని చెప్పడం.. ఆయనలోని జెంటి ల్‌మన్‌కు నిలువెత్తు నిదర్శనం. పాక్‌ మేజర్‌ ఎంత గుచ్చి గుచ్చి ప్రశ్నించినా.. తన పేరు అభినందన్‌ అని, తాను పైలట్‌నని, సర్వీస్‌ నంబర్‌ 27981 అని చెప్పారే తప్ప ఒక్క రహస్యాన్ని కూడా బయటపెట్టలేదు. అనవసర ప్రశ్నలకు సారీ సర్‌ అంటూ సమాధానం దాటవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ వీడియోలతో ఇప్పుడు దేశంలో విక్రం అభినందన్‌ హీరోగా మారిపోయారు. భారత సైనికుడి సత్తా ఇదంటూ సోషల్‌ మీడియాలో  పోస్టుల వరదపారుతోంది.

వెన్నెముకకు గాయమైనా..!
బుధవారం ఉదయం వాస్తవాధీనరేఖకు 7 కిలోమీటర్ల దూరంలో హోర్రా గ్రామంలో భారత్‌కు చెందిన రెండు యుద్ద విమానాలు మంటల్లో చిక్కుకొని కుప్పకూలిపోయాయంటూ డాన్‌ పత్రిక పేర్కొంది. ఒక విమానం నుంచి పైలట్‌ ప్యారాచూట్‌ సాయంతో కిందకి దిగడాన్ని స్థానికులు గుర్తించారు. చేతిలో పిస్టల్‌తో ఉన్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను స్థానికులు చుట్టుముట్టారు. అభినందన్‌ ఇది భారతా? పాకిస్తానా? అని వారిని ప్రశ్నించారు. అభినందన్‌ను పక్కదారి పట్టించడానికి వారు భారత్‌ అని చెప్పారు. ఊపిరి పీల్చుకున్న అభినందన్‌ తన వెన్నెముకకు దెబ్బతగిలిందని.. దాహంతో నోరెండిపోతోందని మంచినీళ్లు కావాలని అడిగారు. అభినందన్‌ను చుట్టముట్టిన స్థానికుల్లో కొందరు యువకులు భావోద్వేగాలు ఆపుకోలేక పాకిస్తాన్‌ ఆర్మీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు.

దీంతో అభినందన్‌కి తాను పాక్‌లో ఉన్నానని అర్థమైంది. వెంటనే చేతిలో ఉన్న పిస్టల్‌తో గాల్లో కాల్పులు జరుపుతూ.. పరుగులు తీశారు. వెన్నెముకకు గాయమై బాధిస్తున్నా పరుగు ఆపలేదు. ఆయనను పట్టుకోవడానికి స్థానికులు వెంబడిస్తే ఒక నీటి కుంటలోకి దూకేశారు. భారత్‌ రహస్యాలు పరాయి దేశస్తుల చేతుల్లో పడకూడదన్న ఉద్దేశంతో తన దుస్తుల్లో దాచుకున్న కీలక డాక్యుమెంట్లను నమిలి మింగడానికి ప్రయత్నించారు. మరికొన్ని డాక్యుమెంట్లు, మ్యాప్‌లు నీళ్లలో ముంచేశారు. ఆయన్ను వెంబడిస్తూ వచ్చిన స్థానికులు నిర్బంధించి రక్తం కారేలా కొట్టారు. ఇంతలో అక్కడికి వచ్చిన పాక్‌ ఆర్మీ గ్రామస్తులు నుంచి అభినందన్‌ను రక్షించి తమ అధీనంలోకి తీసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అభినందన్‌ కనబరిచిన తెగువ దేశ ప్రజల మనసులను గెలుచుకుంది.

ఎఫ్‌–16నే కూల్చేశారు
ఆయన నడుపుతున్న మిగ్‌ 21 బైసన్‌ కుప్పకూలడానికి కొద్ది సెకండ్ల ముందు కూడా అభినందన్‌ తాను చేయాల్సిన పని పైనే దృష్టి పెట్టారు. శత్రుదేశ యుద్ధ విమానం ఎఫ్‌–16ను గురితప్పకుండా కాల్చి కూల్చేశారు. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే ఆర్‌–73 క్షిపణిని ప్రయోగించి అభినందన్‌ ఈ పని పూర్తి చేశారు. ఎప్పుడో 1960 కాలం నాటి క్షిపణిని ప్రయోగించి గురితప్పకుండా ప్రత్యర్థి అత్యాధునిక విమానాన్ని కూల్చివేయడం అరుదైన ఘటన అని వైమానిక వర్గాలు పేర్కొన్నాయి. పాక్‌ ఎఫ్‌–16 యుద్ధ విమానాలు భారత్‌ భూభాగంలోకి 7 కి.మీ. దూరంలోకి చొచ్చుకు వచ్చినా అనుకున్న లక్ష్యాలను ఛేదించలేకపోయాయి. వీటి రాకను గుర్తించి గస్తీ తిరుగుతున్న రెండు మిగ్‌–21 బైసన్‌ విమానాలువెంబడించాయి. ఈ ప్రయత్నంలో రెండు ఎఫ్‌–16 విమానాల మధ్యకు అభినందన్‌ మిగ్‌ దూసుకెళ్లింది. తర్వాత విమానం అదుపుతప్పింది. పరిస్థితి చేయిదాటుతున్నా.. మిగ్‌ కూలిపోవడానికి ఆఖరి నిమిషంలో ఎఫ్‌–16ని  కూల్చేశారు.

వాఘా వద్ద అభినందన్‌కు ఆహ్వానం
న్యూఢిల్లీ: ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ శుక్రవారం సాయంత్రం భారత్‌–పాక్‌ సరిహద్దుల్లోని వాఘా పోస్ట్‌ వద్ద స్వదేశంలోకి అడుగుపెట్టనున్నారు. ఐఏఎఫ్‌ అధికారుల బృందం వాఘా వద్ద ఆయనకు స్వాగతం పలకనుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన్ను పాక్‌ సైన్యం అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించనుందా లేక భారత అధికారులకు అప్పగిస్తుందా అనే విషయంలో స్పష్టత రాలేదు. పంజాబ్‌లోని అట్టారి వద్ద భారత్‌–పాక్‌ సరిహద్దుల్లో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రధాని మోదీని కోరారు. ‘పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శిస్తున్నాను. ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఉన్నాను. అట్టారి వద్ద ఆయన్ను దేశంలోకి ఆహ్వానించటాన్ని గౌరవంగా భావిస్తాను. నాకు మాదిరిగానే అభినందన్, ఆయన తండ్రి కూడా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీలో శిక్షణ పొందినవారే. నాకు అవకాశం ఇవ్వండి’అంటూ ఆయన ప్రధానిని ట్విట్టర్‌లో కోరారు. 

మరిన్ని వార్తలు