అభినందన్‌తో కలిసి ఎయిర్‌ చీఫ్‌ విహారం

2 Sep, 2019 17:28 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌తో కలిసి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా మిగ్‌ 21 సోర్టీ యుద్ధవిమానాన్ని చివరిసారిగా నడిపారు.  ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ హోదాలో ఇది ధనోవా చివరి గగన విహారం. అంతేకాదు.. ఈ విహారానికో ప్రత్యేకత ఉంది. గతంలో అభినందన్‌ తండ్రి సింహకుట్టి వర్థమాన్‌తో కలిసి ధనోవా యుద్ధవిమానాన్ని నడిపించారు. ఎయిర్‌ మార్షల్‌గా సింహకుట్టి రిటైరయ్యారు. ఆయన కొడుకు అయిన అభినందన్‌ భారత వైమానిక దళంలో పనిచేస్తుండటమే కాదు.. గత ఫిబ్రవరిలో గగనతలంలో పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరి వైమానిక పోరులో దాయాదికి చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని వీరోచితంగా కూల్చేసిన సంగతి తెలిసిందే.

దాయాదితో వీరోచిత పోరులో అసమాన ధైర్యసాహసాలకు మారుపేరుగా నిలిచిన అభినందన్‌తో కలిసి మిగ్‌ 21 యుద్ధవిమానాన్ని నడిపించిన ధనోవా అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అభినందన్‌తో తనకు పలు విషయాల్లో సారూప్యతలు ఉన్నాయని, అందుకే అతనితో కలిసి చివరిసారిగా యుద్ధవిమానాన్ని నడిపించానని తెలిపారు. తాము ఇద్దరం కూలిపోతున్న యుద్ధవిమానం నుంచి తప్పించుకొని కిందకు దిగామని, అదేవిధంగా పాకిస్థానీలతో పోరాడామని ధనోవా వివరించారు. ఇక, అభినందన్‌ తండ్రి సింహకుట్టితో కలిసి తాను గతంలో యుద్ధ విమానం నడిపించానని, ఇప్పుడు ఆయన కొడుకుతో కలిసి యుద్ధ విమానం నడిపించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. 


 

మరిన్ని వార్తలు