అబార్షన్‌కు 24 వారాల గడువు

30 Jan, 2020 03:10 IST|Sakshi

గరిష్ట కాలపరిమితిని 24 వారాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం

శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు

న్యూఢిల్లీ: అబార్షన్‌ చేయించుకోవడానికి ప్రస్తుతం ఉన్న 20 వారాల గరిష్ట కాలపరిమితి గడువును 24 వారాలకు పెంచుతూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచార కేసుల్లో గర్భం దాల్చిన మహిళలు, రక్తసంబంధీకుల ద్వారా గర్భం దాల్చిన మహిళలు, దివ్యాంగులు, మైనర్లు వంటి ప్రత్యేక కేటగిరి మహిళలకే 24 వారాల గడువు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్‌ దీనికి సంబంధించిన బిల్లుకి ఆమోద ముద్ర వేసింది.

మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971కి సవరణలు చేస్తూ మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నన్సీ (సవరణ) బిల్లు, 2020ని కేంద్రం రూపొందించింది. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్‌ సమావేశానంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాతో మాట్లాడారు. గర్భ విచ్ఛిన్నానికి గరిష్ట గడువుని 20 వారాల నుంచి 24 వారాలకి పెంచడం వల్ల ఎందరో మహిళలకు బాగా సాయపడుతుందని అన్నారు.

అత్యాచార బాధితులు, మైనర్లు గర్భం దాల్చినప్పటికీ చాలా ఆలస్యంగా గ్రహిస్తారని, అలాంటి వారికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని అన్నారు. అంతేకాదు సులువుగా గర్భస్రావం, మహిళల పునరుత్పత్తి హక్కుల్ని కాపాడినట్టు అవుతుందని చెప్పారు. చాలా మందితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు జవదేకర్‌ చెప్పారు. దీనిని ఒక ప్రగతిశీల సంస్కరణగా జవదేకర్‌ అభివర్ణించారు. అయితే ఇన్నాళ్లూ ఒక వైద్యుడు అంగీకరిస్తే అబార్షన్‌ చేసేవారని, కానీ 24 వారాలు వచ్చాక అబార్షన్‌ చేస్తే ఇద్దరు వైద్యులు అంగీకరించాల్సిన అవసరం ఉందని, వారిలో ఒకరు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యుడు అయి ఉండి తీరాలని జవదేకర్‌ వివరించారు.

నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలకు ఎన్‌ఈసీ నిధుల్లో 30%
నార్త్‌ ఈస్ట్రన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఈసీ) నిధుల్లో 30 శాతం సమాజంలో అణగారిన వర్గాలు నివసించే ప్రాంతాలు, నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాల్లో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టులకి ఈ నిధుల్ని కేటాయించనున్నారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి ఎన్‌ఈసీ నిబంధనల్ని కూడా సవరించనున్నారు. మిగిలిన నిధుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టులకు కేటాయిస్తారు.  

>
మరిన్ని వార్తలు