‘అర్బన్‌ నక్సల్స్‌తోనే జేఎన్‌యూకు అపకీర్తి’

13 Jan, 2020 19:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూలో ఈనెల 5న చోటుచేసుకున్న హింసాకాండపై ఏబీవీపీ, వామపక్ష విద్యార్ధుల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. అర్బన్‌ నక్సల్స్‌ జేఎన్‌యూకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని బీజేపీ అనుబంధ ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి అన్నారు. ప్రతిష్టాత్మక జేఎన్‌యూ విద్యార్ధులుగా తాము గర్విస్తున్నామని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పేర్కొన్నారు. అథ్యాపకులు సైతం తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జేఎన్‌యూ విద్యార్ధులపై తమ కార్యకర్తలు ముసుగు దాడులకు పాల్పడ్డారన్న విద్యార్ధుల ఆరోపణలను ఏబీవీపీ తోసిపుచ్చింది. యూనిటీ ఎగనెస్ట్‌ లెఫ్ట్‌ పేరిట ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో ఛాటింగ్‌ను మార్ఫింగ్‌ చేశారని ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సిద్ధార్ధ్‌ యాదవ్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు జేఎన్‌యూ క్యాంపస్‌లో దాడిపై పోలీసుల దర్యాప్తును జేఎన్‌యూ విద్యార్ధి సంఘం తప్పుపట్టింది. దాడికి గురైన బాధితులపైనే అభియోగాలు మోపుతూ పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. దాడి జరిగిన రోజు పోలీసులు, సెక్యూరిటీ గార్డులు బాధితులను కాపాడేందుకు ముందుకు రాలేదని ఆరోపించింది.

మరిన్ని వార్తలు