ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా

14 Sep, 2019 08:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవితోపాటు మరో రెండు పదవులు కైవసం చేసుకుంది. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో ఏబీవీపీకి చెందిన అశ్విత్‌ దాహియ ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి చెత్న త్యాగిపై 19వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత కొన్ని సంవత్సరాల ఎన్నికలు పరిశీలిస్తే ఇదే అత్యధిక మెజార్టీ అని ఏబీవీపీ జాతీయ మీడియా కన్వీనర్‌ మోనికా చౌదరి తెలిపారు. మహిళా సాధికారత కోసం ‘మిషన్‌ సాహసి’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏబీవీపీకి చెందిన ప్రదీప్‌ తన్వార్‌ ఉపాధ్యక్షుడిగా, శివాంగి ఖర్వాల్‌ జాయింట్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలో ఆ సంస్థ మద్దతుదారులు భారీ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.

కాంగ్రెస్‌ అనుబంధ నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) ఒక సెక్రటరీ పదవిని గెలుచుకుంది. ఆ సంస్థ అభ్యర్థి అశిష్‌ లంబా ఏబీవీపీ అభ్యర్థి యోగి రతీపై విజయం సాధించారు. రామ్‌జాస్‌ కాలేజ్‌లో అల్లర్లు జరిగినపుడు యోగి అధ్యక్షుడిగా ఉన్నారని, అల్లర్లకు తాము వ్యతిరేకమని ఈ తీర్పుతో విద్యార్థులు స్పష్టం చేశారని ఎన్‌ఎస్‌యూఐ తెలిపింది. గురువారం జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో 39.90 శాతం ఓటింగ్‌ నమోదైంది. గత సంవత్సరం ఓటింగ్‌ శాతం (44.46)తో పోలిస్తే ఇది దాదాపు నాలుగు శాతం తక్కువ. మొత్తం నాలుగు స్థానాలకు 16 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో నలుగురు మహిళా అభ్యర్థులున్నారు. 1.3లక్షల మంది ఓటర్లున్నారు. వామపక్ష పార్టీల మద్దతు సంస్థ ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ) ఒక్క సీటూ గెలవలేకపోయింది. గతంతో పోలిస్తే తమ ఓటింగ్‌ శాతం పెరిగినందుకు ఆ సంస్థ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. 

మరిన్ని వార్తలు