యాప్ ఆధారిత బస్ సేవలపై ఏసీబీ దర్యాప్తు!

1 Jun, 2016 20:23 IST|Sakshi
యాప్ ఆధారిత బస్ సేవలపై ఏసీబీ దర్యాప్తు!

న్యూఢిల్లీః రాజధాని నగరంలో యాప్ ఆధారిత ప్రిమియమ్ బస్ సర్వీసులపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఆప్ సర్కార్ ప్రతిపాదించిన బస్ సర్వీసులకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తిరస్కరించడమే కాక, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో, ప్రీమియం బస్ సేవలపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.

ఢిల్లీ యాంటీ కరప్షన్ బ్రాంచ్ బుధవారం ఢిల్లీలో ప్రారంభించనున్న యాప్ బేస్డ్ ప్రీమియం బస్ సర్వీసులపై దర్యాప్తు ప్రారంభించింది. యాప్ ఆధారిత బస్సు సేవలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఫిర్యాదు పటిషన్ దాఖలు చేయడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. అక్రమ ఎల్జీ నోటిఫికేషన్ జారీపై  తమకు ఫిర్యాదు అందడంతో వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ ఛీఫ్ ఎం.కె.మీనా తెలిపారు. బీజేపీ నేత మంగళవారం ఫిర్యాదు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రీమియం బస్సుల విషయంలో ఒకే ఒక్క యాగ్రిగేటర్ ను ప్రోత్సహించారన్న వాదంతో పాటు... యాప్ ఆధారిత బస్సుల్లో ఎటువంటి నియమ నిబంధనలు పాటించలేదని, బస్ మార్గాలు, బస్సుల సంఖ్య కూడ నిర్ణయించకపోవడంపై తమకు ఆరోపణలు వచ్చినట్లు మీనా తెలిపారు.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం  జూన్ 1 నుంచి రాజధానిలో యాప్ ఆధారిత ప్రీమియం బస్ సేవలు ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు స్వంత కార్లనుంచి ప్రజా రవాణా వ్యవస్థపై మొగ్గు చూపాలన్న ఉద్దేశ్యంతోనే తాము ఈ సేవలను ప్రోత్సహించామని, ఇందులో ఎటువంటి స్వలాభం లేదని 'ఆప్' ప్రభుత్వం వాదిస్తోంది.

మరిన్ని వార్తలు