'దేశంలో మగ టీచర్లే అధికం'

23 Sep, 2019 17:43 IST|Sakshi

ముంబై: మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలోని ఉపాధ్యాయులపై చేపట్టిన లింగ నిష్పత్తి సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోని బోధన సిబ్బందిలో ఆడవారి కంటే ఎక్కువ మంది మగ ఉపాధ్యాయులు ఉన్నారని వెల్లడించింది.  అంతేకాక ఉపాధ్యాయుల లింగనిష్పత్తి అత్యల్పంగా బీహార్‌లో నమోదైనట్లు పేర్కొంది. కానీ ఒక్క నర్సింగ్ కోర్సులోని ఉపాధ్యాయుల్లో మాత్రం భిన్నంగా.. మగవారి కంటే ఎక్కువగా ఆడవారు ఉన్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లోని బోధనేతర సిబ్బందిలోనూ మహిళల కంటే ఎక్కువగా మగవారే ఉన్నట్లు ఈ సర్వేలో నిరూపితమయింది.

దేశంలో బోధన సిబ్బంది సంఖ్య మొత్తం 14 లక్షలకు పైగా ఉపాధ్యాయులు ఉండగా.. అందులో మగవారు 57.8 శాతం, మహిళలు 42.2 శాతం ఉన్నారు. బీహార్‌ మాత్రం అతి తక్కువ మహిళ టీచర్లను కలిగి.. అత్యల్ప లింగ నిష్పత్తితో ప్రథమ స్థానంలో ఉంది. అక్కడి ఉపాధ్యాయుల్లో 78.97 శాతం మగవారు ఉండగా, 21.03 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇదేకోవలో జార్ఖండ్ రెండవ స్థానాన్ని, ఉత్తరప్రదేశ్‌ మూడవ స్థానాన్ని ఆక్రమించాయి. అయితే వీటికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాల్లో (కేరళ, పంజాబ్, హర్యానా, చంఢీగర్‌, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ, గోవా) మగ ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని సర్వే నివేదిక వెల్లడించింది.

అఖిల భారత స్థాయి బోధన సిబ్బందిలో.. ప్రతి 100 మంది మగ ఉపాధ్యాయులకు.. విశ్వవిద్యాలయ స్థాయిలో 58 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా కళాశాల, స్టాండ్-అలోన్ సంస్థల వారిగా చూసినట్లయితే వరుసగా.. 76, 71 శాతం మంది మహిళలు ఉన్నారు. ముస్లిం మైనారిటీకి చెందిన వారిలో 57 శాతం మంది మహిళలు ఉండగా, ఇతర మైనారిటీల్లో ప్రతి 100 మంది మగవారికి 151 మంది మహిళలు ఉన్నారు.  ఇక వికలాంగ(పీడబ్ల్యూడీ) వర్గానికి చెందిన బోధన సిబ్బందిలో.. మగవారికంటే తక్కువగా 37 మంది మహిళలు ఉన్నారు.

అయితే మగవారి కంటే అత్యధిక మహిళా ఉపాధ్యాయులు కలిగిన ఏకైక కోర్సు నర్సింగ్. మగ ఉపాధ్యాయులను తోసిరాజని మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. నర్సింగ్ కోర్సులలో 100 మంది మగ ఉపాధ్యాయులకు అత్యధికంగా 330 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని సర్వే తెలిపింది. 

మరిన్ని వార్తలు